ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని అనడం మినహా మహిళలకు సరైన గౌరవం దక్కిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. మహిళలకు అన్ని రకాల వసతులు, అవకాశాలు కల్పిస్తామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ వారి కోసం చేసినదీ శూన్యం. కేంద్రంలో ఎన్డీయే అధికారానికి వచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో మహిళలకు తగిన గౌరవమూ, ప్రాధాన్యమూ లభిస్తోంది. ముఖ్యంగా రాజకీయాల్లో మహిళలకు సముచిత అవకాశాలు కల్పించాలన్న తపన బీజేపీలో ఎక్కువగా కనిపిస్తోంది. వారిలో చైతన్యం తీసుకొచ్చి.. సిస్టమేటిక్ గా వారిని రాజకీయ స్రవంతిలోకి భాగస్వాములను చేసే ప్రక్రియను వేగవంతం చేసింది.
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో…
అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మహిళలను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తొలి సారి ఓటేస్తున్న మహిళలను పార్టీ వైపుకు తిప్పుకునే దిశగా మహిళా సదస్సులు నిర్వహించబోతోంది. వేర్వేరు వృత్తుల్లో రాణించిన మహిళలను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల లోపు వెయ్యి యువ సమ్మేళనాలు నిర్వహించేందుకు బీజేపీ మహిళా మోర్ఛా సిద్ధమైంది. అందులో ప్రతీ ఒక్క మహిళ ఆకాంక్షలను, ఆందోళనను విని అర్థం చేసుకుని వాటిని పరిష్కరించేందుకు బీజేపీ ముఖ్యులు ప్రయత్నిస్తారు.
కర్ణాటక ఫలితం తర్వాత…
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత పార్టీ వ్యూహం మారింది. మహిళల ఓట్లు కాంగ్రెస్ వైపుకు వెళ్లడం వల్లే పరాజయంపాలయ్యామని బీజేపీ గుర్తించింది. పైగా తాజా సర్వేలు కూడా దాదాపుగా అదే ఫలితాన్నిచ్చాయి. సగటు మహిళలు బీజేపీకి కొంచెం దూరం జరిగే ప్రమాదం ఉందని పెద్దలు గుర్తించారు. దానితో మహిళలను ఆకట్టుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలన్న ఆదేశాలు అందాయి. ఢిల్లీలో మహిళా రెజ్లర్ల వివాదం కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. ఒక్కరు చేసిన తప్పుతో మొత్తం పార్టీ పరువే పోయిందన్న ఫీలింగ్ జనంలో రావడంతో అలాంటి అపోహలు తొలగించాలని ప్రచార కార్యక్రమం అవసరమని బీజేపీ గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తోంది.
మోదీ స్కీములే శ్రీరామక్ష
ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సామాజిక స్కీములే మహిళలను బలమైన ఓటు బ్యాంకుగా ఉంచుతాయని బీజేపీ విశ్వసిస్తోంది. మహిళా స్వయం సహాయ బృందాలను ప్రోత్సహించడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచారు. డ్రోన్ల నిర్వహణలో కూడా శిక్షణ ఇచ్చారు. 13 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ద్వారా ఆయా కుటుంబాల్లో మహిళలకు కూడా ఆత్మవిశ్వాసం కల్పించినట్లయ్యింది. మరో పక్క రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అత్యాచారాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించి ఆ దిశగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. నహీ సహేగీ రాజస్థాన్ అనే ప్రచార కార్యక్రమం ద్వారా మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. డాక్టర్లు, టీచర్లు, సామాజిక కార్యకర్తలను ప్రత్యేక టార్గెట్ చేసుకుని ప్రచార కార్యక్రమాలుంటాయని బీజేపీ మహిళా మోర్ఛా ప్రకటించింది.