40 రోజుల చంద్ర ‘మండల’ దీక్షతో దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరంలోని చందమామను ముద్దాడారు. ప్రపంచంలోని మరే దేశమూ ఇప్పటివరకు సాధించని ఘనతను సాధించారు. జయహో భారత్.. జయ జయహో ఇస్రో శాస్త్రవేత్తలు అంటూ నినాదాలు చేశారు. ఆ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారు అక్షయ్ కుమార్ అభిమానులు..
అక్షయ్ ఫ్యాన్స్ కోరిక
చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని భారతీయులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది నిజంగా అద్భుతమైన ఫీట్. ముఖ్యంగా 2019 లో చంద్రయాన్ 2 విఫల ప్రయత్నం తర్వాత చంద్రయాన్ వెనుక ఉన్న ఇస్రో శ్రమ ఫలించడం ఒక గొప్ప అనుభూతి. ఇస్రో బృందాన్ని అభినందిస్తున్న భారతీయులతో పాటు, సెలబ్రిటీలు కూడా మిషన్ మూన్ విజయానికి సంబరాలు చేసుకుంటున్నారు. వారిలో అక్షయ్ కుమార్ ఒకరు. అయితే చంద్రయాన్ 3 విజయం సందర్భంగా ఈ బ్యాక్ డ్రాప్ లో మిషన్ మూన్ మూవీ చేయాలని కోరుతున్నారు అభిమానులు.
మిషన్ మంగళ్ తర్వాత మిషన్ మూన్
మిషన్ మంగళ్‌యాన్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్ర నుంచి 2013 నవంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ సి-25సి ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చైనా, జపాన్ దేశాలకు కూడా సాధ్యం కాని అంగారక యాత్రను భారత్ విజయవంతంగా పూర్తిచేసి కొత్త చరిత్రను లిఖించింది. మార్స్ మిషన్‌ను తొలి ప్రయత్నంలోనే కక్ష్యలోకి పంపిన తొలిదేశంగా భారత్ రికార్డుకెక్కింది. ఇలాంటి గొప్ప ప్రయోగం గురించి, దాని కోసం ఇస్రో శాస్త్రవేత్తలు పడిన కష్టం గురించి దేశ ప్రజలు తెలుసుకోవాలనే సంకల్పంతో దర్శకుడు జగన్ శక్తి ‘మిషన్ మంగళ్’ను తెరకెక్కించారు. ఇందులో అక్షయ్ కుమార్ నటించాడు. సైన్స్‌లో ఉండే సిద్ధాంతాలు, సమీకరణాలు, సంఖ్యలతో ప్రేక్షకులు గందరగోళం పడకుండా దర్శకుడు సంక్లిష్టమైన విషయాన్ని సులభతరమైన స్క్రీన్‌ప్లేతో చెప్పారు. కథ, అందులోని పాత్రలకు ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. మిషన్ మంగళ్ తర్వాత అలాంటి చరిత్రాత్మక ఘట్టం అయిన చంద్రయాన్ 3 సక్సెస్ ని తెరపైకి తీసుకురాగల సత్తా అక్షయ్‌కు ఉందని భావిస్తున్నారంతా.
అక్షయ్ కెరీర్లో ఎన్నో ప్రయోగాలు
అక్షయ్ కుమార్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సిల్వర్ స్క్రీన్ పై కి తీసుకొచ్చాడు. ప్యాడ్‌మ్యాన్, కేసరి, ఎయిర్‌లిఫ్ట్, బెల్ బాటమ్, మిషన్ మంగళ్ సహా కెరీర్ లో ఎన్నో చెప్పుకోదగిన ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు చంద్రయాన్ 3 విజయంతో ఇప్పుడు ఖిలాడీ అభిమానులంతా ఈ ఘట్టాన్ని తెరపై ఆవిష్కరింపచేయాలని కోరుతున్నారు. మరి అక్షయ్ ఏమంటాడో..