అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయమే ఉంది. ఇంకా షెడ్యూల్ రానప్పటికీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ప్రారంభించేందుకు అన్ని పార్టీలు వేగంగా కదులుతున్నాయి. అధికార బీజేపీ ఇప్పటికే తొలి జాబితాను ఆవిష్కరించడంతో పాటు మధ్యప్రదేశ్ ప్రోగ్రెస్ రిపోర్టును కూడా విడుదల చేసింది. విజయావకాశాలను మెరుగు పరుచుకునే క్రమంలో ఉంది.
ఈ సారి 64 మంది..
అభ్యర్థుల ద్వితీయ జాబితాను విడుదల చేసేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. 64 మందితో జాబితా సిద్దం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా కొన్ని ఇబ్బందుల వల్ల అది ఒకటి రెండు రోజులు జాప్యమవుతోందని రాష్ట్ర పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ అభ్యర్థులు ఓడిపోయిన నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నందున ఈ సారి కేండెంట్స్ ఎంపికలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. గత ఎన్నికల ముందు కొందరు నేతలు పార్టీ ఫిరాయించడం కారణంగా ఆయా నియోజకవర్గాల్లో ఓటమి తప్పలేదని బీజేపీ విశ్లేషించుకుంది. రెబెల్స్ గా మారి పార్టీ ఓటమికి కారణమైన వాళ్లు కూడా ఇప్పుడు టికెట్లు అడుగుతున్నారు.
తక్కువ మార్జిన్ తో ఓటమి..
అతి తక్కువ తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలు కూడా ఇప్పుడు ప్రకటించాలనుకున్న జాబితాలో ఉన్నాయి. దక్షిణ గ్వాలియర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి నారాయణ్ సింగ్ కేవలం 121 ఓట్ల తేడాతో ఓడోపోయారు. ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వాలా వద్దా అన్న డైలమా కొనసాగుతోంది.ఒకప్పుడు పార్టీపై తిరుగుబాటు చేసిన సమీక్షా గుప్తా కూడా ఇప్పుడు టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయి బంధువు అనూప్ మిశ్రా కూడా ఇక్కడే టికెట్ అడుగుతున్నారు.
సర్వేలే ప్రాతిపదికగా…
ఈసారి విజయవకాశాలను బేరీజు వేసుకునని మరీ జాబితాను డిక్లేర్ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకోసం వేర్వేరు స్థాయిల్లో జరిపిన సర్వేలపై ఆధారపడి విశ్లేషణలు జరుపుతోంది. సర్వేలో గెలుస్తారని తెలిసిన వారిని మాత్రమే పరిణగణలోకీ తీసుకోవాలనుకుంటోంది. గతంలో గెలిచిన చరిత్ర ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. వరుసగా రెండు సార్లు ఓడిపోయిన వారికి మాత్రం ఈ సారి అవకాశం రాకపోవచ్చు. రెండో జాబితాలోని 64 నియోజకవర్గాలను గుర్తించే ప్రక్రియ మాత్రం పూర్తయ్యింది.
సమాజ్ వాదీ పార్టీ కూడా..
బీజేపీ, బీఎస్పీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించగా…ఇప్పుడు అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ కూడా వారి సరసన చేసింది. బుందేల్ ఖండ్ ప్రాంతంలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అవి ఉత్తర ప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాలు కావడంతో తమకు విజయావకాశాలు ఉంటాయని ఎస్పీ నమ్ముతోంది. గత ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటే తాము కింగ్ మేకర్స్ గా మారే అవకాశం ఉందని అఖిలేష్ ఎదురు చూస్తున్నారు..