చంద్రయాన్ -3 సూపర్ సక్సెస్ – నీటి జాడ మాటేమిటి ?

140 కోట్ల మంది భారతీయుల కల నెరవేరింది. చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతమైంది.ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికిత్తురాయి వచ్చి చేరింది. అంతరిక్ష విజ్ఞానంలో భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలిచింది. చాలా దేశాలకు సాధ్యం కాని ప్రయోగాన్ని మన శాస్త్రవేత్తలు అలవోకగా చేసి చూపించారు. నిన్న సాయంత్రం సరిగ్గా 06.04 గంటలకు చంద్రయాన్ -3 చంద్రునిపై దిగింది. టచ్ డౌన్ సజావుగా సాగుతూ శాస్త్రవేత్తలు, టీవీలకు అతుక్కుపోయి కూర్చున్న సామాన్యుల్లో అమితానందానికి అవకాశం ఇచ్చింది.

చందమామ చేతికి చిక్కిన వేళ…

చంద్రునిపై దిగడం అంత సులభమేమీ కాదు. గతంలో చంద్రయాన్ -2 ఫెయిల్ అయిన టెన్షన్ ఇస్రోను వెంటాడుతూనే ఉంది. పట్టు వదలని విక్రమార్కుడి లాగ ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగడంతో అన్ని టెన్షన్లు తీరాయి. జూలై 14న శ్రీహరికోట నుంచి మొదలైన విజయయాత్ర ఆగస్టు 23న ల్యాండర్ దిగే వరకు ఉత్కంఠగానే సాగిందని చెప్పాలి. దాదాపు 40 రోజుల ప్రయాణంలో నాలుగు లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడం మామూలు విషయం కాదు. అందుకే ప్రధాని మోదీ నుంచి సామాన్యుడి వరకు ప్రతీ ఒక్కరూ ఈ ఫీట్ ను అమితానందంగా తిలకించారు. ఈ క్రమంలో అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా.. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్‌ ఘనత సాధించింది. చంద్రయాన్‌-3 కంటే ముందే చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగాలని ఉవ్విళ్లూరిన రష్యా లూనా-25.. జాబిల్లిపై కుప్పకూలిన నాలుగు రోజుల వ్యవధిలోనే ఇస్రో ఈ అద్భుత ఘనత సాధించింది..

4 గంటల్లోనే రోవర్ బయటకు..

ప్రయోగం సక్సెస్ చేయడమే కాదు.. దాన్ని మలిదశలోకి తీసుకెళ్లడంలో కూడా ఇస్రో తనదైన వేగాన్ని ప్రదర్శించింది. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. ల్యాండింగ్ జరిగిన తర్వాత రెండు గంటల 26 నిమిషాలకు ప్రజ్ఞాన్ బయటకు వచ్చిందని అంటుండగా, కాదు..కాదు..నాలుగు గంటల సమయం తర్వాత వచ్చిందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సున్నితంగా దిగడం అంటే సాప్ట్ ల్యాండింగ్ వల్ల రోవర్ కు ఎలాంటి డ్యామేజ్ కాలేదని తెలుస్తోంది. ఒక లూనార్ డే అంటే భూమిపై లెక్క ప్రకారం 14 రోజుల పాటు ప్రజ్ఞాన్ రోవర్ అక్కడ తిరుగుతూ చంద్రుడిపై ఫోటోలు తీసి పంపుతుంది. చంద్రుడి ఉపరితలం మీద మాత్రమే కాకుండా అంతరాళ్లలో కూడా ఫోటోలు తీసేందుకు రోవర్ సేవలను ఉపయోగించుకోవాలని ఇస్రో తీర్మానించింది. వీలైతే మరో లూనార్ డే కూడా రోవర్ ను పనులకు పొడిగించేందుకు ఇస్రో ప్రయత్నిస్తుంది.

ఆ ఒక్కటీ తెలిస్తే… ?

ప్రజ్ఞాన్ రోవర్ లో రెండు పే లోడ్స్ ఉంటాయి. ఆల్ఫా పార్టికిల్ ఎక్స్ రే స్పెక్ట్రో మీటర్ ( ఏపీఎక్స్ఎస్) ద్వారా ల్యాండర్ దిగిన పరిసరాల్లో మట్టి, ఇసుక, రాళ్లలో ఉన్న ఖనిజ సంపదను గుర్తిస్తారు.మేగ్నిషియం, అలూమీనియం, సిలికాన్, పోటాషియం, క్యాల్షియం, టిటానియం, ఐరన్ ఆనవాళ్లను కనుగొనేందుకు ప్రయత్నిస్తారు. లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోమీటర్ (లిబ్స్) ద్వారా చంద్రునిపై రసాయన మార్పులను తెలుసుకుంటారు. ప్రజ్ఞాన్ లో ఉన్న ఆరు చక్రాలు అది వేగంగా తిరిగేందుకు దోహదం చేస్తుండగా. నావిగేషన్ కెమెరా దానికి దిశానిర్దేశం చేస్తుంది. రోవర్ 50 వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సమర్థత ఉన్నందున ఎలాంటి అవరోధం లేకుండా పనులు సాగించే వీలు కలుగుతుంది. ఇప్పుడు ఇస్రో ముందున్న ఛాలెంజ్ ఒక్కటే. చంద్రునిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. చందమామాపై అతి శీతల వాతావరణంలో తేమ, చెమ్మకు నీటిగా మార్చుకునే వీలుంటుందా అని చూడాలి. అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుందని గుర్తించిందున నీటి జాడ ఉన్నట్లుగా తెలిస్తే.. దాన్ని ఆక్సిజన్ గా మార్చుకునే వీలు కూడా కలుగుతుందన్నది ఇస్రో విశ్వాసం. అప్పుడు పరిశోధనలు మరింత వేగంగా ముందుకు సాగడం సాధ్యం.