ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టిక్కెట్లపై జగన్ పునరాలోచన – పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యం !?

తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలకు గడ్డు పరస్థితులు ఎదురవుతున్నాయి. వారు వచ్చినప్పటి నుండి తమ అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చారు కానీ.. వైసీపీ నేతల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ వారికే టిక్కెట్లు ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడ ఉన్న వైసీపీ నేతలు వేరే దారి చూసుకుంటున్నారు. దీంతో వైసీపీ పెద్దల్లో అంతర్మథనం ప్రారంభమవుతోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తున్నామా అన్న ఆలోచనతో మనసు మార్చుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితి

వల్లభనేని వంశీ టీడీపీ నుంచి చాలా తక్కువ ఓట్లతో రెండో సారి గెలిచారు. ఆయన వ్యవహరంపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. ఆయన టీడీపీలోనే ఉండి ఉంటే ఆయనకే టిక్కెట్ ఖరారు చేసే వారు. ఈ సారి అక్కడ వైసీపీ విజయం కేక్ వాక్ అయ్యేది. కానీ వంశీని చేర్చుకోవడంతో ఆయనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వచ్చి పడటమే కాదు… పార్టీ కోసం కష్టపడిన నేతల్ని వదులుకోవాల్సి వస్తోంది.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో గన్నవరం పరిధిలోని నున్న గ్రామంలో ఓ వార్డు స్థానానికి ఎన్నిక జరిగింది. అక్కడ వంశీ టీడీపీలో ఉన్నప్పుడు కూడా.. వైసీపీకే మెజార్టీ వస్తుంది. అక్కడ వంశీ తన అభ్యర్థిని నిలబెట్టారు. చాలా ఖర్చు చేశారు. కానీ అక్కడ టీడీపీ అభ్యర్థే విజయం సాధించారు. ఇది వైసీపీ పెద్దలను మైండ్ బ్లాంక్ చేసిందని చెబుతున్నారు.

వంశీపై వ్యతిరేకత కారణంగానే నున్న వార్డులో ఓటమి !

అక్కడ ఉన్న పరస్థితుల్ని ఆరా తీస్తే.. పూర్తిగా వంశీపై వ్యతిరేకత వల్లనే ఆ ఫలితం వచ్చిందని నిర్ధారించుకున్నారని అంటున్నారు. ఈ పరిణామంతో పాటు యార్లగడ్డ వెంకట్రావును కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయక… మొత్తంగా రెచ్చగొట్టి బయటకు పంపేశారన్న ఆగ్రహం హైకమాండ్ లో కనిపిస్తోంది. యార్లగడ్డ టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీలోనే ఉండేవారని.. కానీ ఉండలేని పరిస్థితుల్ని సృష్టించారని గన్నవరంలో పాత వైసీపీ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాలన్నింటిపై .. వైసీపీ హైకమాండ్ సీరియస్ గా ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం టిక్కెట్ పైనా ఇచ్చిన హామీ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంటోది.

గుంటూరు పశ్చిమ, చీరాల, విశాఖ దక్షిణలోనూ పునరాలోచన

చీరాలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది . అక్కడ ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన ఆమంచికి అన్యాయం చేసి … టీడీపీ నుంచి వచ్చిన కరణంకో చోటివ్వడం మంచిదేనా అని చర్చలు ప్రారంభించారు. అలాగే.. విాఖ దక్షిణంలో వాసుపల్లి పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని స్పష్టమయింది. గుంటూరు పశ్చిమలో ప్రజలు ఎమ్మెల్యేల్ని మర్చిపోయారు. అక్కడ ఇతర వైసీపీ నేతలే అన్ని పనులు చక్క బెడుతున్నారు. దీంతో వారందర్నీ ఎందుకు భరించాలన్న చర్చ వైసీపీలో ప్రారంభమయింది