ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో అధికారిక పర్యటన జరుపుతున్నారు. మూడు రోజుల టూర్ లో భాగంగా బ్రిక్స్ ( బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు) సదస్సులో పాల్గొని ప్రసంగించారు. భారత అభివృద్ధిని, ప్రపంచ దేశాలతో కలిసి భారత్ నడుస్తున్న తీరును ప్రధాని మోదీ వివరించారు.
2047 భారత అభివృద్ధి పరుగులు
భారత ప్రజలు దృఢనిశ్చయంతో ఉన్నారు. అభివృద్ధి ఒక్కటే వాళ్ల అజెండాలో ఉందని మోదీ గుర్తుచేసుకున్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆయన బ్రిక్స్ దేశాలను ఆహ్వానించారు. ఇందుకోసం పరస్పర విశ్వాసం అవసరమని కూడా ఉద్ఘాటించారు. దక్షిణార్థభాగ దేశాల అభివృద్ధికి ప్రత్యేక భాగస్వామ్యం అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. కొవిడ్ -19 నేర్పిన గుణపాఠాలు కూడా దేశాల అభివృద్ధికి, పరస్పర సహకారానికి ఉపయోగపడతాయని మోదీ అన్నారు.
స్టార్టప్స్ లో దూసుకుపోతున్న ఇండియా..
భారత ఆర్థిక వ్యవస్థ ఇదే స్థాయిలో పరుగులు పెడితే త్వరలోనే 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మోదీ జోస్యం చెప్పారు. మన ఆర్థిక విధానాలు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. ప్రపంచానికే మనం గ్రోత్ ఇంజిన్ గా రూపాంతరం చెందుతున్నామన్నారు. వ్యాపారానుకూలతలో భారత్ అందరికంటే ముందుందని అన్నారు. దేశంలో స్టార్టప్స్ బాగా పెరిగాయని, ఆ రంగంలో భారత్ , ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని ఆయన ప్రస్తావించారు. దేశంలో వందకు పైగా యూనికార్న్ లు ఉన్నాయన్నారు. ప్రపంచం అభివృద్ధిలో బ్రిక్స్ దేశాల భాగస్వామ్యం అనివార్యం, అనిర్వచనీయమని మోదీ అన్నారు. వ్యవస్థాగత అభివృద్ధి, భవిష్యతుల్లో పరస్పర సహకారానికి అవసరమైన అంశాలను గుర్తించేందుకు బ్రిక్స్ సదస్సు దోహదం చేస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. బహుళతత్వంలో సంస్కరణల పథం వైపు పయనించేందుకు బ్రిక్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రధాన భూమిక పోషిస్తాయని మోదీ తన మాటగా చెప్పారు. బ్రిక్స్ సదస్సుతో పాటు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడం కూడా పరస్పర అవగాహనకు ఉపయోగపడతాయని ఆ దిశగా దక్షిణాఫ్రికా ప్రభుత్వ ప్రయత్నాలు శ్లాఘనీయమని మోదీ కితాబిచ్చారు.
చంద్రయాన్ -3 వైపు ఓ కన్ను
చంద్రయాన్ -3 ల్యాండింగ్ జరుగుతున్న తరుణంలోనే ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన మనసు మాత్రం ఇక్కడే ఉందని చెప్పారు. చంద్రయాన్ -3 సక్సెస్ కావాలని ప్రార్థించే వారిలో మోదీ అగ్రగణ్యులు. ల్యాండింగ్ ప్రక్రియను అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మోదీ తిలకిస్తారని పీఎంఓఏ వర్గాలు వెల్లడించారు. ఇస్రో శాస్త్రవేత్తల ప్రయత్నాన్ని ఆయన ఇప్పటికే పలు పర్యాయాలు ప్రశంసించారు.