ఆదిత్య ఠాక్రే అనుచరులకు బిగుస్తున్న ఉచ్చు – కష్టాల్లో ఉద్ధవ్ తనయుడు ?

కాదేదీ స్కాముకు అనర్హం అని రాజకీయ నాయకులు అంటూనే ఉంటారు. దొరికిన చోట దోచుకో, తినుకో, దాచుకో అన్నది వారి కరెప్షన్ ఫిలాసఫీ. మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఉన్నన్ని రోజులు అవినీతిని అందలం ఎక్కించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులోనూ జనం నానాతంటాలు పడి, వేల సంఖ్యలో చనిపోయిన కొవిడ్ -19 సమయంలోనూ భారీ స్కాములు చేసినట్లు ఆలస్యంగా వెలుగు చూస్తున్న అంశం…

ఆదిత్య అనుచరుడికి ముంబై పోలీసుల సమన్లు ..

మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే కూడా మంత్రిగా చేశారు. అప్పట్లో ముంబై కొవిడ్ సెంటర్ నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. శివసేన ఎంబీటీ నాయకుడు ఆదిత్య ఠాక్రేకి అత్యంత సన్నిహిత అనుచరుడిగా భావించే సూరజ్ చవాన్ కు ఇప్పుడు ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విచారణ విభాగం సమన్లు పంపింది. ఇప్పటికే జూన్ 27న కేంద్ర దర్యాప్తు సంస్థయిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సూరజ్ చవాన్ ను ఐదు గంటల పాటు ప్రశ్నించింది. కొవిడ్ స్కామ్ కు సంబంధించి 15 చోట్ల తనిఖీలు నిర్వహించిన తర్వాత సూరజ్ ను ఈడీ ప్రశ్నించింది..

రూ. 4 వేల కోట్ల కాంట్రాక్ట్

కొవిడ్ 19 చికత్స, ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించిన పనుల కోసం ముంబై నగరంలో రూ. 4 వేల కోట్లు కేటాయించారు.అందులో జరిగిన స్కాముకు సంబంధించి ఐదుగురు లైజన్ ఏజెంట్లు కీలకపాత్ర పోషించారు. సూరజ్ చవాన్ కు బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి పదవి లేకపోయినా కాంట్రాక్టుల కేటాయింపులో అతను కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఒక ఇంట్లో సోదాలు జరిగినప్పుడు ఈడీకి దొరికిన డైరీలో కీలక వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి.

ఆదిత్య ఆదేశాల మేరకేనా…

ముందుగానే తమకు నచ్చిన కాంట్రాక్టర్లను ఎంపిక చేసి టెండర్లు నిర్దేశించారని ఈ పనులన్నీ సూరజ్ చవాన్ చూసుకున్నాడని ఈడీతో పాటు ముంబై పోలీసులు నిర్ధారించారు. ఆదిత్య సూచనల మేరకే ఆతను అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్ధారించారు. కాంట్రాక్టర్లకు సంబంధించిన అక్రమ చెల్లింపుల వ్యవహారంపై కూడా దర్యాప్తు సంస్థలు కూపీ లాగాయి. కొవిడ్ ను నయం చేసే విషయంలో అత్యంత ముఖ్యమైన ఒషధం రెమిడెసివర్ ను అత్యధిక ధరకు కొనుగోలు చేసి ఖజానాకు నష్టం కలిగించారని అధికారులు గుర్తించారు. కొవిడ్ పేషంట్లను ఉంచేందుకు అద్దెకు తీసుకున్న భవనాలను వైరస్ తగ్గిపోయిన తర్వాత కూడా కొనసాగించి భవన యజమానులకు అద్దె చెల్లించారు. దీని కోసం కొన్ని సూట్ కేసు కంపెనీలను సైతం సృష్టించారు. టెండర్ ప్రక్రియలో శివసేన ఎంపీ సంజయ్ రావత్ హస్తం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్న తరుణంలో ఆయన్ను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది.