ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉత్సాహం ఒక్క సారిగా తగ్గిపోయినట్లుగా కనిపిస్తోంది. కొత్త అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాస్త హుషారుగా ప్రభుత్వంపై పోరాడినప్పటికీ.. కొత్త కమిటీ ప్రకటించిన అందరిలోనూ ఓ రకమైన నిర్లిప్తత కనిపిస్తోంది. ఎవరు ఏం చేయాలన్నదానిపై స్పష్టత లేకపోవడంతో… ప్రభుత్వంపై పోరాటానికి వేసిన ప్రణాళికలన్నీ కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో బీజేపీ క్యాడర్ లో మళ్లీ నిర్లిప్తత కనిపిస్తోంది.
గతంలో పలు కార్యక్రమాలతో ఊపు
గత ఏడాదిన్నరగా బీజేపీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు చేపట్టింది. ప్రజాపోరు సభల దగ్గర్నుంచి ప్రజా చార్జిషీట్ వరకూ అన్నీ ఉద్ధృతంగా నిర్వహించారు. ఏపీ బీజేపీకి ఉన్న వనరుల కొరత అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇలాంటి మైనస్ లను అధిగమించి యువనేతలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేశారు. ప్రజల కోసం పార్టీ ఉందన్న అభిప్రాయం కల్పించారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలపైనా చేసిన ప్రచారం ఉద్ధృతంగా సాగింది. ఆ ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమయ్యే సమయంలో… ఇప్పుడు ఓ రకమైన నిర్లిప్తత ఏర్పడింది.
ప్రధాన కార్యదర్శల పని తనమే కీలకం !
పార్టీ కార్యకలాపాలు చురుగ్గా సాగాలంటే ప్రధాన కార్యదర్శులు కీలకం. గతంలో ప్రధాన కార్యదర్శులుగా యువనేతలు ఉండేవారు. విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ వంటి వారు ప్రధాన కార్య.దర్శులుగా ఉంటూ… రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలను సమన్వయం చేసుకునేవారు. పార్టీ క్యాడర్ ను నిత్యం యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నించేవారు. అయితే ఇప్పుడు వారికి ఉపాధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. కొత్త ప్రధాన కార్యదర్శలను నియమించారు. కానీ వారికి కనీస గుర్తింపు కూడా లేదు. వారెవరో పార్టీ లోనే చాలా మందికి తెలియదు. దీంతో … ఒక్క సారిగా కార్యకలాపాల్లో నిశ్శబ్దం ఏర్పడింది.
తేలిపోయిన ఓటరు చేతన అభియాన్
ఏపీలో ఓటర్ల జాబితా అవకతకలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ ప్రత్యేక ఉద్యమం చేపట్టింది.. ఓటరు చేతన అభియాన్ కు ఇంచార్జ్ గా ఉన్న బండి సంజయ్ ఏపీకి రావాల్సి ఉంది. కానీ ఆయన రాకను కోఆర్డినేట్ చేసుకోలేకపోయారు. చివరికి వీడియో కాన్ఫరెన్స్ తో సరి పెట్టారు. రొటీన్ ప్రెస్ మీట్ తో ముగిసిపోయింది. ఓటర్ జాబితాలపై బీజేపీ ఎలా ఉద్యమం చేయాలనుకుందో క్లారిటీ లేకుండా పోయిందిన్న అభిప్రయం వినిపిస్తోంది.
పార్టీ తరపున మాట్లాడేవాళ్లను కించపరుస్తూండటంతో మరింత సమస్య
బీజేపీలో చురుగ్గా తిరిగే నాయకులపై వ్యతిరేక మీడియాలో ఓ ప్రచారం జరుగుతూ ఉంటుంది. నిత్యం మీడియాలో కనిపిస్తూ ఉంటారని.. అదేదో తప్పు అన్నట్లుగా చెబుతూంటారు. నిజానికి వారు మీడియాలో కనిపించి… పార్టీ కోసమే ప్రచారం చేస్తారు. పార్టీ వాయిస్ నుప్రజల్లోకి తీసుకెళ్తారు. వారు మాట్లాడితే మీడియా ప్రయారిటీ ఇస్తుంది. అలాంటి వారికి ప్రాధాన్యత తగ్గించి మిగిలిన వారికి ఏం సందేశం ఇస్తారన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. మొత్తంగా ..బీజేపీలో ఓ రకమైన నిరుత్సాహం ఏర్పడిందని.. క్యాడర్ కూడా ఆవేదన చెందుతున్నారు.