లోకేష్‌కు హ్యాండిచ్చిన కేశినేని నాని – పార్టీ మార్పు ఖాయమేనా ?

విజయవాడ ఎంపీ కేశినేని నాని.. లోకేష్ పాదయాత్రలో కనిపించలేదు. ఆయన నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర జరుగుతున్నా.. ఆయన కానీ ఆయన కుమార్తె … కార్పొరేటర్ అయిన కేశినేని శ్వేత కూడా లోకేష్ కు సంంఘిభావం చెప్పలేదు. అసలు కలవలేదు. కనీసం తమ అనుచరుల్ని కూడా పంపలేదు. దీంతో మరోసారి టీడీపీలో కేశినేని తీరుపై చర్చ ప్రారంభమయింది.

చంద్రబాబుపై వ్యతిరేకతతో కేశినేని నాని

కృష్ణా జిల్లా నేతల మధ్య ఉన్న అంతర్గత రాజకీయాల కారణంగా.. టీడీపీ ఓడిపోయినప్పటి నుంచి కేశినేని నాని భిన్నంగా స్పందిస్తున్నారు. అత్యంత కీలక సమయాల్లో కూడా పార్టీకి అండగా ఉండలేదు. టీడీపీ ఆఫీసుపై అల్లరి మూకలు దాడి చేసినప్పుడు కూడా స్పందించలేదు. అయితే పార్టీ తరపున అధికారిక కార్యక్రమాలకు మాత్రం ఎప్పుడూ మిస్ కాలేదు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లకు హాజరయ్యే వారు. చంద్రబాబు పర్యటనల్లో ఢిల్లీకి కూడా వెళ్లి వచ్చారు. ఇటీవల పుంగనూరులో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి సమయంలోనూ స్పందించారు. వైసీపీపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాదయాత్ర విషయంలో ఆయన అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడంతో ఆయన పార్టీకి దూరమైనట్లేనని చెబుతున్నారు.

నితిన్ గడ్కరీతో కేశినేని నానికి సన్నిహిత సంబంధాలు

తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా టిక్కెట్ల కసరత్తు జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు టిక్కెట్లపై ఓ అంచనాకు వచ్చారని చెబుతున్నరు. ఈ కసరత్తులో కేశినేని నాని పేరు ఎక్కడా వినిపించలేదు. విజయవాడ ఎంపీ సీటును ఆయనకు మళ్లీ ఇస్తారన్న ప్రచారం లేదు. దీనికి కారణం ఆయన వ్యవహారశైలే. ఈ కారణంగానే ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ ను టీడీపీ అధినేత ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. కేశినేని నాని తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని గతంలో ప్రకటించారు. అంటే ఆయన ఉద్దేశం.. టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోయినా పోటీ చేస్తాననే. గతంలో కేశినేని బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దిశగా ఆలోచించవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

ఇక కేశినేని టీడీపీ మర్చిపోతుందా ?

టీడీపీ మాత్రం కేశినేని నాని అభ్యర్తిత్వాన్ని ఇక పరిగణనలోకి తీసుకోదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతర్గతంగా ఎన్ని విబేధాలున్నా.. లోకేష్ పాదయాత్రలో కనీసం పాల్గొనే ప్రయత్నం చేయకపోవడాన్ని హైకమాండ్ తేలిగ్గా తీసుకునే అవకాశం లేదంటున్నారు. రాజకీయ భవిష్యత్ ఉంటుందని అనుకుంటున్న నాని కుమార్ కేశినేని శ్వేత కూడా స్ట్రాటజిక్ మిస్టేక్ చేశారని టీడీపీ వర్గాలంటున్నాయి. అయితే కేశినేని కావాలనే టీడీపీకి దూరమవుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.