‘బీమారూ’ కాదు అభివృద్ధి – అమిత్ షా ఆవిష్కరించిన మధ్యప్రదేశ్ రిపోర్ట్ కార్డ్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్ శాసనసభకు కూడా ఈ ఏడాది ఆఖరులో పోలింగ్ జరుగుతుంది. అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతుండగా ఆ దిశగా బీజేపీ కాస్త ముందుందనే చెప్పాలి. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కమలం పార్టీ, ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వ రిపోర్ట్ కార్డ్ ను విడుదల చేసింది. ఇరవై ఏళ్ల కాలంలో మధ్యప్రదేశ్ సాధించిన ప్రగతిని ఈ రిపోర్టు కార్డ్ లో పొందుపరిచారు.

కాంగ్రెస్ దుష్పరిపాలన నుంచి విముక్తి

ఒకప్పుడు ఆ రాష్ట్రాలను బీమారూ స్టేట్ట్ అని పిలిచేవారు. అందులో బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ ఉండేవి. కాంగ్రెస్ పాలనలో ఆ రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోకపోగా తిరోగమనబాటలో నడిచాయి. 2003లో తొలి సారి బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్లో అభివృద్ధి పరుగులు తీయడం మొదలు పెట్టింది. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా విడుదలైన రిపోర్ట్ కార్డ్ లో కూడా అదే విషయం ప్రస్తావనకు వచ్చింది . మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, రాష్ట్ర హోం మంత్ర నరోత్తమ్ మిశ్రా సమక్షంలో ఆయన ఈ రిపోర్ట్ కార్డ్ ను విడుదల చేస్తూ కాంగ్రెస్ వారసత్వమైన వెనుకబాటుతనం నుంచి విముక్తి పొందినందుకు మధ్యప్రదేశ్ ప్రజలను అభినందించారు.

స్వయం సమృద్ధి సాధించిన మధ్యప్రదేశ్

గత రెండు దశాబ్దాల కాలంలో శివరాజ్ పాలన రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లిందని అమిత్ షా ప్రశంసించారు. అంతక ముందు దిగ్విజయ్ సింగ్ పాలనలో రాష్ట్రం దారిద్ర్యంలో మగ్గిపోయిందన్నారు. దేశం గోధుమ ఎగుమతుల్లో 45 శాతం మధ్యప్రదేశ్ నుంచే వెళ్తున్నాయంటే వ్యవసాయం ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ మౌలిక సదుపాయాల పథకం కింద రూ. 4,300 కోట్లు వ్యయం చేశారు. 3.62 లక్షల ఆయుష్మాన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం బట్వాడా చేసింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద మారుమూల ప్రాంతాల్లో సైతం రోడ్ల అభివృద్ధి సాధ్యపడింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు గృహ నిర్మాణంలో మధ్యప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. స్వచ్ఛతా స్కీములో ఇండోర్ నగరానికి దేశంలో రెండో స్థానం దక్కింది.

పేదరికం దూరం – సామాన్యుల్లో ఆత్మవిశ్వాసం

సామాన్య ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గత ఐదేళ్ల కాలంలోనే కోటి 36 లక్షల మంది పేదరికం నుంచి బయట పడ్డారు. విద్యుత్, తాగునీటి సరఫరాల, రోడ్లు, విద్యావకాశాల్లో మధ్యప్రదేశ్ గణనీయమైన అభివృద్ధి సాధించిందని బీజేపీ రిపోర్ట్ కార్డ్ చెబుతోంది. మధ్యప్రదేశ్ ఓటింగ్ సరళిపై కూడా బీజేపీ నేతలు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో 29 లోక్ సభా స్థానాలున్నాయి. 2014లో బీజేపీకి 27 రాగా, 2019లో 28 వచ్చాయి. ఈ సారి 29 స్థానాలు తమకే దక్కుతాయని అమిత్ షా చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో 50 ఏళ్ల అభివృద్ధిపై రిపోర్ట్ కార్డ్ సమర్పించాలని అమిత్ షా సవాలు చేశారు. మరి అందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందో లేదో చూడాలి.