ఇలాంటి సమయంలో భగవద్గీత చదవాలి

భగవద్గీత…ఇందులో సమాధానం లేని సందేహం ఉండదు. జవాబు దొరకని ప్రశ్న ఎదురుకాదు. అందుకే భగవద్గీతని ఓ మతగ్రంధంలా కాకుండా ఈ కలియుగానికి గొప్ప మనోవిశ్లేషణా గ్రంధంగా భావించాలి. భగవద్గీత చదవడానికి ప్రత్యేక సందర్భాలు అవసరం లేదు ఎప్పుడైనా చదవొచ్చు కానీ అది చదవాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆ గ్రంధం గొప్పతనం అర్థమవుతుంది. భగవద్గీత ఎప్పుడు చదవాలి? ఎందుకు చదవాలని ఎవర్నైనా అడిగితే ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతుంటారు. భగవద్గీత చదవడం వల్ల ఐహిక బంధాలు, సుఖాలపై కోరిక తగ్గుతుందని వైరాగ్యం ఏర్పడుతుందని అంటారు.దాదాపు సన్యాస జీవితానికి దగ్గరగా వెళతారు కాబట్టి వయసు మళ్లిన తర్వాత భగవద్గీత చదవాలన్నిది చాలామంది భావన. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భగవద్గీత వయసు మళ్లినవారు చదివే గ్రంధం, ఎవరైనా చనిపోతే అక్కడ వినిపించే గ్రంధం అని చాలామంది మైండ్ లో ఫిక్సైపోయింది. అదే వ్యాప్తి చెందింది కూడా. కానీ ఈ ఆలోచన సరికాదంటారు పండితులు. భగవద్గీత చెప్పిన సందర్భం ఏంటి! తృప్తిగా భోజనం చేసిన తర్వాత సరాదాగా కూర్చుని మాట్లాడుకున్న విషయాలు కావవి, అలా వాహ్యాళికి వెళుతూ మాటల సందర్భంగా చెప్పుకున్నదీ కాదు, ధర్మానికి ప్రతిరూపం అయిన ధర్మరాజుకి కానీ, పితామహుడు భీష్ముడికి కానీ చెప్పలేదు…కరుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న సమయంలో యుద్ధభూమిలో అర్జునుడికి ఉపదేశించిందే భగవద్గీత. అర్జునుడి మనసు సంఘర్షణలతో నిండిపోయినప్పుడు, తాను యుద్ధం చేయననే నిర్వేదం ఆవహించిన సమంలో శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించాడు. “నాకు ఏమీ తోచడం లేదు. ఏ నిర్ణయమూ తీసుకునే శక్తి నాకు లేదు. నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యం ఉపదేశించు” అంటూ పూర్తి శరణాగతుడిగా మారిపోయాడు. ఇప్పటికి నువ్వు తప్ప మరో దిక్కులేదు…నువ్వు చెప్పింది తప్ప మరో ఆలోచన లేదు అని అర్జునుడు శరణాగతి అయిన తర్వాత బోధించాడు. అందుకే మీ జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకి అయినా పరిష్కారం చూపే గురువు భగవద్గీత. ధైర్యాన్ని నూరిపోసే భగవద్గీత మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణే భారతయుద్ధం. మంచి పాండవులు అయితే చెడు కౌరవులు. అంటే మనలో సంఘర్షణ తలెత్తినపుడు నివారణోపాయము చూపేది భగవద్గీత. భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందనీ, స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయనీ, మోక్షం వస్తుందనీ చదవకూడదు. భగవద్గీత మోక్షానికి మార్గం చూపుతుంది, ఆ మార్గంలో నడవాలి. అందుకే విద్యార్ధి దశనుంచీ భగవద్గీతను పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలి. పరిశోధనా అంశంగా పరిగణించాలి. అంతేకానీ ఎవరైనా చనిపోతే వినే గ్రంధం మాత్రం కాదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.