మధ్యప్రదేశ్ – 24 శాతం స్ఠానాల్లో టఫ్ ఫైట్ ఖాయమా ?

మధ్యభారతంలో ఎన్నికల వేడి రాజుకుంది. నవంబరు, డిసెంబరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఎడ్జ్ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నప్పటికీ కీలక నియోజకవర్గాల్లో మాత్రం ఏదైనా జరగొచ్చన్న చర్చ మొదలైంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్న ఓటర్లు ఆయనకు మళ్లీ జైకొట్టే అవకాశాలున్నప్పటికీ ఎక్కడా ఉదాసీనతకు అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనతో బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాలు రచిస్తోంది.

5 శాతం మార్చిన్ భయం

మధ్యప్రదేశ్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. గత ఎన్నికలను విశ్లేషిస్తే విజయాల మార్చిన్ పై కొంత టెన్షన్ తప్పడం లేదు. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో 24 శాతం నియోజకవర్గాల్లో అత్యంత టఫ్ ఫైట్ ఉంటుందని వరుస ఎన్నికలు నిరూపించాయి. అక్కడ విజేతలు, పరాజితల మధ్య ఐదు శాతం ఓట్లు మాత్రమే తేడా కనిపించింది. 55 నుంచి 60 స్థానాల్లో ఏ పార్టీ అయినా విజయం సాధంచే వీలుంటుంది. అటువంటి నియోజకవర్గాలను బీజేపీ ఇప్పటికే గుర్తించడంతో అక్కడ ఖచితంగా గెలిచేందుకు పార్టీ తరపున ప్రచార వ్యూహాలను పదును పెడుతున్నారు. సిట్టింగు అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలా వద్దా.. కొత్త వారికి ఛాన్సిస్తే గెలుస్తారా లేదా అన్న లెక్కల్లోనే తొలి జాబితాను విడుదల చేశామని పార్టీ వర్గాలు చెబుతున్నారు..

30 శాతంపైగా మార్చిన్ చాలా తక్కువ..

5 నుంచి 10 శాతం మార్జిన్ ఉన్న నియోజకవర్గాలు 60కి పైగా ఉన్న నేపథ్యంలో బీజేపీ అక్కడ తక్కువ సీట్లు పొందిందని కూడా గుర్తించారు. నియోజకవర్గాల వారీగా వ్యూహాలు పార్టీ సిద్ధం చేస్తోంది. సామాజిక సమీకరణాలు, స్థానిక సమస్యల పరిష్కారం, విద్యా-ఉద్యోగం- నిరుద్యోగం లాంటి అంశాలను బేరీజు వేసుకుని జనాన్నిఆకట్టుకునే ప్రచార కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. 20 నుంచి 30 శాతం మార్జిన్ ఉన్న నియోజకవర్గాల 23 మాత్రమే ఉండగా, 30 శాతం పైగా మెజార్టీలో అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాలు ఆరు మాత్రమేనని గుర్తించారు. అందులో ఐదు బీజేపీ వారివి. ఈ విశ్లేషణలో ఒక విషయం మాత్రం అర్థమైంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో భారీ మెజార్టీలు సాధించడం కష్టమని తేలిపోయింది.

కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టిన బీజేపీ

ఉమ్మడి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు కాంగ్రెస్ కు తిరుగులేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత బీజేపీ బాగా పుంజుకుంది. 1980లో ఏర్పాటైన బీజేపీ, 21వ శతాబ్దంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2003 అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ కు గడ్డుకాలం మొదలైంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 114 స్థానాలు వచ్చినా మెజార్టీ సాధించలేక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. 109 స్తానాల సాధించిన బీజేపీ మెజార్టీ పొందలేకపోవడానికి ఐదు శాతం మార్జిన్ సమస్యే కారణమని తేల్చారు. తర్వాత జరిగిన పరిణామాల్లో కమల్ నాథ్ ప్రభుత్వం దిగిపోయి.. శివరాజ్ సింగ్ అధాకారాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగితే 19 చోట్ల బీజేపీ గెలిచింది. వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ గెలుస్తుందని చెప్పేందుకు అదే కొలమానమని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.