ఏదో చేయబోయి ఏదో చేసిన రాహుల్ – బీజేపీ హ్యాపీ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, యువనేత రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ వార్తలో వ్యక్తిలా ఉండాలనుకుంటారు. మోదీ ప్రభుత్వాన్ని పీకల దాకా విమర్శించాననుకుని ఆయన తప్పులో కాలేసి నవ్వుల పాలవుతుంటారు. రాజకీయ ప్రత్యర్థులు పప్పు అని సంబోధించినా సరే ఆయనకు తన తప్పులు తెలిసి రావు. ముందు వెనుకా చూసుకోకుండా ఏదోక చర్యకు దిగడం, లేదా సరైన సమాచారం లేకుండానే స్టేట్ మెంట్స్ ఇచ్చెయ్యడం అయనకు బాగా అలవాటైపోయింది. ఒక పని చేస్తే నాలుగు వైపుల నుంచి వచ్చే విమర్శలు ఆయనకు అర్థం కావు. అలా ఎందుకు జరిగిందో అర్థం అయ్యే లోపే మరో సమస్య వచ్చి పడుతుంది. లద్దాఖ్ రోడ్లపై బైక్ రైడ్ రాహుల్ గాంధీ లద్దాఖ్ వెళ్లారు. తన తండ్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా ప్రేయర్ మీటింగ్ పెట్టేందుకు వెళ్లిన ఆయన లద్దాఖ్ రోడ్లపై బైక్ రైడింగ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అంతే ఇక బీజేపీకి మంచి ఆయుధం ఇచ్చినట్లయ్యింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కశ్మీర్ అభివృద్ధిని,లద్దాఖ్ లో బంగారంలా మెరిసిపోతున్న రోడ్లను ప్రమోట్ చేసినందుకు రాహుల్ కు బీజేపీ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ప్రత్యేకంగా ట్వీట్ చేస్తూ.. ఎన్డీయే ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం వేగం పుంజుకుందని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం రాక ముందు లద్దాఖ్ రోడ్ల దుస్థితిని చూపించే కొన్ని ఫోటోలను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ అప్పటికి, ఇప్పటికీ పరిస్థితులను బేరీజు వేసుకునే అవకాశం ఇచ్చిన రాహుల్ కు ధ్యాంక్స్ చెప్పారు. లద్దాఖ్ లో పర్యాటకం అభివృద్ధి చెందిందనడానికి కూడా రాహుల్ పెట్టిన ఫోటో పనికివస్తుందని బీజేపీ అంటోంది. ఇప్పుడు శ్రీనగర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో ప్రశాంతంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగలుగుతున్నామని ఆ పార్టీ గుర్తుచేసింది. ఆర్టికల్ 370 రద్దుతో మార్పు.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా రాహుల్ ఫోటోపై స్పందించారు. రాహుల్ రోడ్ ట్రిప్ ఫోటోలు చూడటం నాకు అనందంగా ఉందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని జనం చాలా ఆనందంగా జీవిస్తున్నారని జోషి విశ్లేషించారు. జమ్మూకశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిన తర్వాత తొలి సారి అక్కడకు వెళ్లిన రాహుల్.. ప్రాంతీయ సమగ్రాభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేయడం ముదావహమన్నారు. వచ్చే వారం కార్గిల్ టూర్ రాహుల్ గాంధీ వచ్చే వారం కార్గిల్ పర్యటనకు వెళతారు. కార్గిల్ యుద్ధం జరిగిన ప్రాంతాలను సందర్శిస్తారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడతారు. ఎక్కడెక్కడ తిరుగుతారో ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. ఏదేమైనా బీజేపీకి ఆయన సదవకశాలు కల్పిస్తున్న మాట మాత్రం వాస్తవం…