అంజీర్ పండ్లు ఆరోగ్యానికి మంచిదని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరూ వీటిని చాలా ఇష్టంగా తింటారు. కానీ అతిగా తింటే మాత్రం అనారోగ్యం తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు
అంజీర్ రెండు రకాలుగా లభిస్తాయి. ఒకటి పండ్ల రూపంలో, మరొకటి డ్రై ఫ్రూట్స్ రూపంలో. ఈ రెండు రకాలుగానూ వీటిని తినొచ్చు. పండ్లు లోపల గుజ్జు పురుగులులా కనిపించడంతో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు కానీ డ్రై ఫ్రూట్స్ మాత్రం బాగానే లాగించేస్తారు. వీటితో కొందరు వంటకాలు కూడా చేస్తారు. ఈ అంజీర్ పండ్లను తినడం వల్ల కడుపు ఉబ్బసం, మలబద్ధకాన్ని నివారిస్తుంది. బరువును నియంత్రించడంలోనూ సహాయపడుతాయి. ఈ పండ్లను తినడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. ఇందులో ఉన్న ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, సల్ఫర్ వంటివి రోగనిరోధకిని పెంచుతాయి. అంతేకాదు. శరీర అలసట, బలహీనతను దూరం చేస్తాయి. అంజీర్ పండ్లలో ఉండే పోషకాలు పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. డెర్మటైటిస్ సమస్య ఉన్నవారు, పొడి చర్మం ఉన్నవారు, చర్మం బాగా దురదలు వచ్చే వారు అంజీర్ పండ్లను తినాలి. అయితే అధికంగా తింటే మాత్రం అనర్థమే అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
అంజీర్ ఎక్కువ తింటే!
అంజీర్ పండ్లలో ఆగ్జలేట్స్ అధికంగా ఉంటాయి. అధికంగా తింటే వీటిలో ఉండే ఆగ్జలేట్స్ శరీరంలో ఉండే కాల్షియం మొత్తాన్ని శోషించుకుంటాయి. దీంతో కాల్షియం లోపం ఏర్పడి ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతాయి. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా తింటే జీర్ణం అయ్యేందుకు ఆలస్యం అవుతుంది…ఫలితంగా గ్యాస్ ఫామ్ అవుతుంది. వీటిలో ఆగ్జలేట్స్ అధికంగా ఉంటాయి కనుక కిడ్నీ స్టోన్స్, కిడ్నీ, మూత్రాశయ సమస్యలు ఉన్నవారు వీటిని తక్కువగా తినాలి. లేదంటే స్టోన్స్ ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయి. త్వరగా జీర్ణం కాని వీటిని అధికంగా తింటే ఆ ప్రభావం లివర్, పేగులపై పడేందుకు అవకాశాలు ఉంటాయి. అంజీర్ పండ్ల విషయంలోనే కాదు ఏ ఆహార పదార్థానికి సంబంధించి అయినా అతి పనికిరాదు. రుచి బావుందని ఎక్కువగా తినడం, రుచి నచ్చక అస్సలు తినకపోవడం లాంటివి చేయొద్దు. మితంగా తినడమే ఆరోగ్యానికి మంచిదని గుర్తుంచుకోవాలి.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.