సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చారు ఆది శంకరాచార్యులు. అశ్వత్థవృక్షము అంటే రావి చెట్టు. సంసారానికి రావిచెట్టుకి ఏంటి సంబంధం.
రావి చెట్టు చాలా పెద్దది. విశాలంగా విస్తరించి ఉంటుంది. అలాగే ఈ సంసారం కూడా అనంతం. దీనికి మొదలు, తుది అంటూ లేదు. మొత్తం విస్తరించేస్తుంది. సంసార వృక్షానికి మూలం అంటూ కనిపించదు. కోరికలు అనంతం. దీనికి మొదలు, తుది లేదు. అంతటా విస్తరించి ఉంటుంది. ఈ సంసార వృక్షమునకు మూలము అంటూ మనకు కనపడదు. ఎవరిలో ఏ కోరిక ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. ఏ బంధము ఎప్పుడు ఎవరితో ఎలా కలుగుతుందో తెలియదు. అలాగే ఈ అశ్వత్థవృక్షం మూలము అంటే వేరు ఎక్కడి వరకు వ్యాపించి ఉందో మనకు తెలియదు, కనపడదు. అనేకములైన శాఖలు ఉపశాఖలు రెమ్మలు ఉన్నాయి. ఈ అశ్వత్థ వృక్షానికి లెక్కపెట్టలేనన్ని ఆకులు ఉన్నాయి. ఆ ఆకులతోనే చెట్టు తన ఆహారాన్ని తయారుచేసుకుంటుంది. సంసారంలో కూడా లెక్కపెట్టలేనన్ని కర్మలు ఉన్నాయి. మనం చేసే పనులు ఇన్ని అని చెప్పలేము. క్షణానికో పని చేస్తుంటాం. ఈ కర్మలతోనే ఈ సంసారాన్ని నడుపుతుంటారు.
ఈ అశ్వత్థ వృక్షానికి పళ్లు కాస్తాయి..ఈ సంసారం అనే వృక్షం కూడా మనం చేసే కర్మలకు తగిన ఫలితాన్ని..అంటే సాత్విక కర్మలకు, రాజస కర్మలకు, తామస కర్మలకు, వాటి వాటికి అనుగుణమైన ఫలితాలు ఇస్తుంది. రావి చెట్టు నిండా పక్షుల గూళ్లు ఉంటాయి. ఎండల వేడి తగలకుండా బాటసారులకు నీడనిస్తుంది కూడా. అంటే మనషులు, పశు పక్ష్యాదులకు ఆశ్రయం కల్పిస్తుంటుంది. అందుకే సంసారాన్ని అశ్వత్థవృక్షంతో పోల్చారు శంకరాచార్యులు. అందుకే సంతానం లేనివారు రావిచెట్టుని పూజించాలి చెబుతారు.
రావి చెట్టులో సకల దేవతలు
ఇంత పవిత్రమైన రావిచెట్టు వేర్లలో విష్ణు భగవానుడు, చెట్టు కాండంలో శివుడు, చెట్టు కాయల్లో సకల దేవతలు కొలువై ఉంటారని స్కంద పురాణంలో ఉంది. ఇంతమంది దేవతలు కొలువై ఉన్న రావి చెట్టును పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. అంతేకాకుండా సంతానం కోసం ఎదురుచూసేవారు ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టి రావిచెట్టు కట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. రావి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని, అనుకున్నవి నెరవేరతాయని పండితులు చెబుతారు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.