ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసినప్పటి నుంచి వారికి అచ్చొచ్చినట్లుగా కనిపించడం లేదు. ఎటోళ్లు అటు వెళ్లాలన్న రంది ఎక్కువగా కనిపిస్తున్నా.. పంటి బిగువున వాళ్లు భరిస్తూ ఒకటిగా ఉంటున్నారు.ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడకపోయినా ఐకమత్యాన్ని నటిస్తున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే స్థాయికి వెళ్లిపోయి అంతలోనే సంయమనం పాటిస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ పైచేయిగా ఉండాలన్న కోరిక తప్పితే కలిసి పోదామన్న ఆకాంక్ష కనిపించడం లేదు.
అల్కా లంబా పేల్చిన బాంబు
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వముంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ సీటు కాదు కదా.. ఒక ఎమ్మెల్యే కూడా లేరు. ఈ సారి ఇండియా కూటమిలో భాగంగా ఆప్ తో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తుందన్న చర్చ జరుగుతోంది. సీట్ల సర్దుబాటు ఉంటుందని భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నాయకురాలు అల్కా లంబా స్టేట్ మెంట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఢిల్లీలోని ఏడు లోక్ సభా స్థానాల్లో పోటీకి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని అధిష్టానం ఆదేశించినట్లు అల్కా… మీడియా ఎదుట ప్రకటించారు. లోక్ సభ ఎన్నికలకు ఏడు నెలలే ఉన్నందున కార్యకర్తలు అవిశ్రాంతంగా పనిచేయాలని పార్టీ పెద్దలు కోరినట్లు కూడా ఆమె చెప్పారు.
మీటింగులో చర్చించారా..
కాంగ్రెస్ సీనియర్లతో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ నిర్వహించి ఎన్నికలకు సమాయత్తమవుతున్న తీరును చర్చించారు. ఎవరు ఏం పని చేయాలో దాదాపుగా దిశానిర్దేశం చేశారు. వరుసగా 19 రాష్ట్రాల నేతలతో పార్టీ అధిష్టానం సమావేశమైందని చెబుతూ… వారి రాష్ట్రాల్లో కష్టపడి పనిచేయాలని సూచించినట్లు అల్కా లంబా వెల్లడించారు. అయితే ఢిల్లీ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపక్ బబారియా వివరణ మాత్రం మరోలా ఉంది. సీట్ల సర్దుబాటుపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన చెబుతున్నారు. అల్కా లంబా వ్యక్తిగత అభిప్రాయాలు చెబుతున్నారని పార్టీలో అలాంటి మాటే రాలేదని బబారియా వాదిస్తున్నారు. ఢిల్లీలో పార్టీని బలోపేతం చేసే విషయం మాత్రమే చర్చించామని ఆయన కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు అజయ్ మాకెన్, అనిల్ చౌదరి కూడా దాదాపుగా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆప్ ఎదురుదాడి
కాంగ్రెస్ తీరు ఆప్ కు ఆగ్రహాన్ని తెప్పించింది.కూటమి అంటూ ఇలా మాట్లాడుతున్నారేమిటన్న అసంతృప్తి వారిలో రగిలింది. ఇంతదానికి ఇండియా కూటమి ఏర్పాటు చేసుకోవడమేందుకు చర్చలు జరపడమెందుకని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎలాంటి వైఖరి పాటించాలో తమ నాయకుడు కేజ్రీవాల్ నిర్ణయిస్తారని ఢిల్లీ నేత వినయ్ మిశ్రా ప్రకటిస్తూ అల్కా మాటలపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కూటమి ధర్మాన్ని పాటించడం లేదని గుర్తు చేశారు. రెండు పార్టీల అధినాయకుల మధ్య చర్చ జరగనిదే ముందస్తుగా ప్రకటన ఎలా చేస్తారని ఢిల్లీ మంత్రి సురభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. ఢిల్లీ ఎంపీ సీట్లపై స్పష్టత రావాలంటే ఇండియా కూ టమి నేతలంతా కూర్చుని మాట్లాడాలని అంతవరకు కాంగ్రెస్ నేతలు తొందరపడాల్సిన అవసరం లేదని ఆయన హెచ్చరించారు.