శ్రీ కృష్ణ జన్మభూమి – యథాతథస్థితికి సుప్రీం ఆదేశం

మథురలో శ్రీ కృష్ణ జన్మభూమి వ్యాజ్యం మళ్లీ తెరపైకి వచ్చింది. సుప్రీం కోర్టు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కక్షిదారులు కూడా పరస్పర ఆమోదయోగ్య పరిష్కారానికి సిద్దంగా ఉండాల్సిన అనివార్యత ఏర్పడింది.

పది రోజుల స్టేటస్ కో ..

శ్రీ కృష్ణ జన్మభూమిపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. పది రోజుల పాటు స్టేటస్ కో ఉత్తర్వులను పాటించాలని సుప్రీం కోర్టు సూచించింది. వారణాలో జ్ఞానవాపి సర్వే తరహాలో శ్రీ కృష్ణ జన్మస్థానంలో కూడా సర్వే చేయాలని శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్ట్ అలహాబాద్ హైకోర్టులో కేసు వేసింది. మథుర షాహీ ఈద్గా మసీదులో ఉన్న ఈ జన్మస్థానంపై వ్యాజ్యాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. దానితో ట్రస్టు సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించి తమ పరిశీలన పూర్తయ్యే వరకు కట్టడాలకు ఎలాంటి మార్పులు జరగకూడదని కూల్చివేతలు, నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పడమే స్టేటస్ కో అని పిలుస్తారు..

అసలేమిటీ వివాదం

మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వ్యవహారంలో 13.37 ఎకరాల భూమి యాజమాన్యానికి సంబంధించిన వివాదం కొన‌సాగుతోంది.అక్టోబరు 12, 1968న శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహీ మసీదు ఈద్గా ట్రస్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.13.7 ఎకరాల స్థలంలో గుడి, మసీదు రెండింటినీ నిర్మించాలని ఒప్పందం జరిగింది.శ్రీకృష్ణ జన్మస్థానానికి 10.9 ఎకరాల భూమి, షాహీ ఈద్గా మసీదుకు 2.5 ఎకరాల భూమి యాజమాన్యం ఉంది.షాహీ ఈద్గా మసీదును అక్రమంగా నిర్మించారని హిందూ పక్షం చెబుతోంది.షాహీ ఈద్గా మసీదును తొలగించి ఈ భూమిని శ్రీకృష్ణ జన్మస్థలానికి ఇవ్వాలని హిందువుల తరఫు నుంచి డిమాండ్‌ వచ్చింది.

కోర్టుకెక్కిన హిందూ భక్తులు

శ్రీ కృష్ణ జన్మభూమిని తమకు అప్పగించాలని కొందరు హిందూ భక్తులు కోర్టుకెక్కారు. పిటిషనర్ లాయర్ మహేంద్ర ప్రతాప్ సింగ్ తన అప్పీల్‌లో శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాంగణం నుండి షాహీ మసీదు ఈద్గాను తొలగించాలని డిమాండ్ చేశారు. స్థలం మొత్తం ఆలయానిదేనని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారని కోర్టులో వాదించారు. 1968లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ వర్సెస్ షాహీ మసీదు ఈద్గా మధ్య జరిగిన ఒప్పందాన్ని కూడా పిటిషన్‌లో సవాలు చేశారు.సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ III సోనికా వర్మ కోర్టు ప్రతివాదులందరికీ ఈ ఏడాది ప్రారంభంలో నోటీసులు జారీ చేశారు.మథురలోని షాహీ ఈద్గా మసీదు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం పరిధిలోకి వస్తుందని తేల్చారు. అయితే సర్వేపై మాత్రం కోర్టుల్లో వ్యాజ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. బంతి ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉంది.