నోటి దుర్వాసన తగ్గాలంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు

బ్రష్ చేసుకుంటున్నా, అవసరం అయిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా నోటి దుర్వాసన తగ్గడం లేదా ? ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నోటి దుర్వాసన ఎందుకొస్తుంది
దంతాలు, నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడం, తరచూ నోరు పొడిబారడం, చిగుళ్ల సమస్యలు, దంతాల్లో క్యావిటీ ఉండడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ఇంకా ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడంతో పాటూ పళ్ల మధ్య ఆహారం ఇరుక్కుపోవడం కూడా దుర్వాసనకు కారణం అవుతుంది. ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారికి కూడా ఈ ఇబ్బంది ఉంటుంది.

నోటి దుర్వాసన తగ్గాలంటే..
@ తరచూ ఉప్పు నీటిని పుక్కిలించడం వల్ల నోటిలో ఉన్న చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా నిరోధించవచ్చు. అదేవిధంగా చిగుళ్ల వాపు, రక్తం కారడం వంటి సమస్యలను కూడా నయం చేస్తుంది.
@ పెరుగులో ప్రోబయోటిక్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన సమస్యను పోగొడతాయి. భోజనం చివర్లో కచ్చితంగా పెరుగన్నం తినడం వల్ల నోట్లో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది
@ భోజనం చేసిన అరగంట తర్వాత గ్రీన్ టీ తాగండి. ఇందులో ఉండే పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేస్తాయి.
ఆహారంలో క్యాప్సికమ్, బ్రొకోలిలను భాగం చేసుకుంటే వాటిలో ఉండే విటమిన్‌ సి క్రిములను చంపేస్తుంది. దీంతో నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది.
@ విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్‌ వంటి పండ్లను తింటుంటే నోటి దుర్వాసన రాదు. దంత సమస్యలు కూడా పోతాయి. చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయి.
@ భోజనం చేశాక ఒకటి రెండు లవంగాలను నోట్లో వేసుకుని చాలా సేపు అలాగే చప్పరించాలి. దీంతో నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. @ లవంగాల్లో ఉండే పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేసి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.
@ భోజనం చేసిన తరువాత టీస్పూన్‌ సోంపు తిన్నా నోటి దుర్వాసన తగ్గి, నోరు ఫ్రెష్‌ అవుతుంది.
@ ఒకటి రెండు పుదీనా లేదా తులసి ఆకులను అలాగే పచ్చిగా నమిలేయాలి. దీంతో నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు.
@ నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు పుష్కలంగా నీరు తాగాలి. ఒకవేళ అదే పనిగా నీరు తీసుకోవడం ఇష్టం లేకపోతే అందులోకి కొద్దిగా నిమ్మరసం జోడించుకోవచ్చు.
@ తేనె, దాల్చినచెక్క ఈ రెండింటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.