బాలినేని, మాగుంట జట్టు కట్టారా ? ప్రకాశం అధికార పార్టీలో ఏం జరుగుతోంది ?

టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కనుసన్నల్లో ఉన్న ప్రకాశం జిల్లా వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం ఎదురు తిరుగుతోంది. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాను ఒంగోలు అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. తానే కాదు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేశారు. ఇలా చెప్పడానిక ఆయన ఎందుకు అంత తొందరపడ్డారో కానీ.. జగన్ పై మైండ్ గేమ్ ప్రారంభించారని వైసీపీలో చర్చ జరుగుతోంది. టిక్కెట్లు ప్రకటించుకోవడం అనేది వైసీపీలో అరుదు. అందుకే బాలినేని.. ఏదో ప్లాన్ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత కాలంగా అసంతృప్తిలో బాలినేని బాలినేని శ్రీనివాసరెడ్డి… తనను జగన్ నిర్లక్ష్యం చేశారన్న అసంతృప్తిలో ఉన్నారు. వైవీ సుబ్బారెడ్డి తనను టార్గెట్ చేయడంతో ఆయన ఇతర బాధ్యతల్ని వదులుకున్నారు. పలుమార్లు జగన్ మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడినా మనసు మార్చుకోలేదు. గతంలో తన స్థానంలో తన భార్య పోటీ చేయవచ్చునని.. మరొకరు పోటీ చేయవచ్చునని.. తనకుమారుడి సీటివ్వాలని అడిగినట్లుగా రకరకాలుగా చెప్పారు. తనకు కూడా టిక్కెట్ గ్యారంటీ లేదన్నారు. అయితే ఇప్పుడు మాత్రం సీటు ప్రకటించేసుకున్నారు. తనతో పాటు మాగుంట శ్రీనివాసలరెడ్డికి కూడా ఎంపీ సీటు ప్రకటించారు. నిజానికి ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని వైవీ సుబ్బారెడ్డి అనుకుంటున్నారు. మాగుంట, బాలినేని ఒకటయ్యారా ? మాగుంట శ్రీనివాసులరెడ్డి తాను ఇక పోటీ చేయనని తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తారని ఇంతకు ముందే ప్రకటించారు. ఆయనకుమారుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని ఇటీవలే బెయిల్ పై వచ్చారు. ఆయన వైసీపీ కార్యక్రమాల్లో అంత చురుకుగా లేరు. ఇప్పుడు హఠాత్తుగా మాగుంటను కూడా సీన్ లోకి తీసుకు వచ్చి ఎందుకు ఈ ప్రకటన బాలినేని చేశారన్నది కీలకంగా మారింది. తన మాటలకు ప్రాధాన్యం ఇస్తే మాత్రమే పోటీ చేస్తామని లేకపోతే లేదన్న సంకేతాలను బాలినేని పంపారని అంటున్నారు. వైవీ సుబ్బారెడ్డికి… మాగుంటకు కూడాపెద్దగా సంబంధాలు లేవు కాబట్టి… ఆయననూ కలుపుకున్నారని అంటున్నారు. బాలినేని, మాగుంటలపై సైలెంట్ గా టీడీపీ మరో వైపు బాలినేని, మాగుంటలను … టీడీపీ అసలు టార్గెట్ చేయడం లేదు. పాదయాత్రలో లోకేష్ అన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతల్ని టార్గెట్ చేస్తున్నారు కానీ.. ఒంగోలుకు వచ్చి మాగంటను.. బాలినేనేనిని విమర్శించలేదు. దీంతో ఆయన టీడీపీతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం ప్రారంభమయింది. దీన్ని బాలినేని కొట్టిపడేస్తున్నారు. ఇతరులు చేసే ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన పని లేదంటున్నారు. కానీ.. జగన్ రెడ్డి టిక్కెట్ ఇవ్వకపోతే ఏం చేస్తారన్నది వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీటీడీ చైర్మన్ పదవి కూడా పోవడంతో ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంట్ సీటు మీద కన్నేశారు.