కాంగ్రెస్ అంటే అవినీతి, కాంగ్రెస్ అంటేనే కలెక్షన్. తెల్లారితే డబ్బులు వసూలు చేయకుండా ఉండలేని రాజకీయ వ్యవస్థ కాంగ్రెస్. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని వేడుకుని అధికారానికి వచ్చిందే తడవుగా కరెప్షన్‌కు తెరతీయడం ఆ పార్టీకే చెల్లింది. ఇప్పుడు కూడా కర్ణాటకలో ఆ పార్టీ కాసులు దండుకునే ప్రయత్నంలో ఉంది.
కాంట్రాక్టులను సమీక్షిస్తామని డీకేఎస్ బెదిరింపులు
బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ తీసుకుంటుందని ఎన్నికల్లో ఆరోపించి అధికారానికి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మాత్రం వసూళ్ల పర్వానికి తెరతీసింది. బెంగళూరూ నగరంలో బీజేపీ హయాంలో చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల బిల్లులు చెల్లించేందుకు పర్సంటేజ్ అడుగున్నట్లు సమాచారం. దీని కోసం కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. 2019 నుంచి 2023 వరకు చేసిన పనులకు సంబంధించి రూ. 710 కోట్లు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ల ఖాతాలోకి వేయకుండా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అడ్డుకున్నారు. డబ్బులు కాంట్రాక్టర్ల ఖాతాలో వేసే ముందు వారు చేసిన పనులను పరిశీలించి, నాణ్యతను చూడాలని శివకుమార్ ప్రకటించేశారు. పనులు పూర్తి చేయకపోయినా,పనుల నాణ్యత లేకున్నా వాటికి డబ్బులు చెల్లించాలా వద్దా అన్నది తర్వాత నిర్ణయిస్తామని డీకేఎస్ చెబుతున్నారు.
కనిష్టంగా పది శాతం కమీషన్
కమీషన్ల కోసమే కాంగ్రెస్ నేతలు తమను బెదిరించి , వేధిస్తున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు. స్టాటస్ అన్న పేరుతో తమపై వత్తిడి తెస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 2019-20లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రిలీజ్ చేయాలంటే 10 శాతం కమీషన్ ఇవ్వాలని, 2020-21లో చేసిన పనులకు నిధులు విడుదల చేయాలంటే 15 శాతం కమీషన్ ఇవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కూడా గతవారం ఇలాంటి ఆరోపణలే చేశారు. ముఖ్యమంత్రి పేషీ నుంచి డిప్యూటీ సీఎం కార్యాలయం వరకు అన్ని ఆఫీసులు అవినీతికి అడ్డాగా మారాయని కుమారస్వామి ఆరోపిస్తున్నారు. కొందరు కాంట్రాక్లరు నేరుగా గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు. కమీషన్ అడగడం లేదని దేవుడి ముందు ప్రమాణం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తక్షణమే నిధులు విడుదల చేయాలని కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న విజ్ఞప్తి చేశారు. అయితే ఎక్కడా అవినీతి ఆరోపణలు చేయకుండా జాగ్రత్త పడ్డారు.
ఎదురుదాడికి కాంగ్రెస్ ప్రయత్నం
ఆరోపణలపై ఎదురుదాడి చేసేందుకు సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రయత్నించారు. కాంట్రాక్ట్‌ల నాణ్యతను పరిశీలించడంలో తప్పేమిటని సిద్దూ ప్రశ్నించారు. బీజేపీ కాంట్రాక్టర్లు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని డీకేఎస్ అంటున్నారు. పైగా బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్యేలైన అశోక్, అశ్వత్థ నారాయణ, గోపాలయ్య పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆయన మరో ఆరోపణ సంధించారు. పైగా పనులను పరిశీలించేందుకు ఐఎఎస్ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శివకుమార్ ఎన్ని మాటలు మాట్లాడినా విశ్వసించేందుకు బెంగళూరు జనం సిద్ధంగా లేరన్నది మాత్రం నిజం. గతంలో కూడా కర్ణాటక కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు ఉండటం, డీకేఎస్‌పైనే కేసులు ఉండటంతో 15 శాతం కమీషన్ నిజమేనని వారు అంటున్నారు.