వర్షాకాలంలో కార్ డ్రైవింగ్ చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవాలి

తెలుగు రాష్ట్రాల్లో వానల దంచికొడుతున్నాయి. ఓ పది నిముషాలు ఆగకుండా వానపడితే చాలు ఎక్కడికక్కడ నీరు నిలిచి రోడ్లు చెరువులను తలపిస్తుంటాయి. కార్యాలయాలకు వెళ్లేవారు, ఇతర పనులపై బయటకు వెళ్లకతప్పనివారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు అడుగుపెడతారు. ముఖ్యంగా వానలో కార్ డ్రైవ్ చేసేవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. అవేంటో చూద్దాం..

రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయిన ఉన్నప్పుడు అందులోంచి వేగంగా దూసుకెళితే నీళ్లు ఫౌంటెన్ లా ఎగిరి పక్కడపడతాయి. చూడ్డానికి ఇది చాలా బావుంటుంది కానీ ఇది మీ కారుకి అంతమంచిది కాదు. వేగంగా కారు దూసుకొచ్చినప్పుడు బంపర్ నీటిని బలంగా ఢీకొని డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే నీటిలో కారు డ్రైవ్ చేసినప్పుడు నెమ్మదిగా పోనివ్వడం మంచిది

నీటి లోతును గమనించకుండా దూసుకెళ్లిపోవద్దు. రెగ్యులర్ గా తెలిసిన దారేకదా అని వెళ్లిపోతే మన రోడ్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. మీరు గతంలో గమనించని గుంతల్లోకి కారు దిగి…కారుకి డ్యామేజ్ జరగొచ్చు, మీరు గాయపడొచ్చు.

ముందు వాహనానికి, మీకు మధ్య కొంత గ్యాప్ ఉంచుకోవడం చాలా అవసరం. లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది..పైగా ముందున్న వాహనాన్ని గమనిస్తూ రోడ్డుపై ఉన్న నీటిమట్టం అంచనా వేస్తూ మీరు డ్రైవ్ చేయడం కొంత సేఫ్ కూడా.

పోటాపోటీగా వెళ్లాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఓవర్ టేక్ చేసిన కారు లేదా బైక్ ని దాటి వెళ్లాలని పంతంగా డ్రైవ్ చేసేవారూ ఉన్నారు. కానీ మన రోడ్లపై అలాంటి సాహసాలు చేయకపోవడమే మంచిది. నీరు నిలిచిన రోడ్డుపై ఇలాంటి పోటీలకు దిగితే అది ప్రమాదానికి దారితీస్తుంది.

మెట్రో సిటీస్‌లో, ప్రధాన సిటీల్లో భారీగా వర్షం పడినప్పుడు నీరు ఆగకుండా ఉండేలా రోడ్లను డిజైన్ చేస్తున్నారు. దీని కారణంగా రోడ్లలో మధ్యలో ఉండే లేన్‌లో నీరు తక్కువగా ఉంటుంది. చివరి లేన్లలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాన పడినప్పుడు, నీరు నిలిచిన సందర్భాల్లో రోడ్డు మధ్యలో డ్రైవ్ చేయడమే సేఫ్

ఒక్కోసారి కారు నీటి మధ్యలో సడెన్ గా ఆగిపోతుంది. అలాంటప్పుడు అక్కడే ఉండి పదే పదే రైజ్ చేయకూడదు. ఎందుకంటే కారులో గాలి తగలాల్సిన ప్రదేశాల్లో నీరు చేరి ఉంటుంది. అందుకే నీటి నుంచి కారుని బయటకు తోసేందుకు ఎవరినుంచైనా సహాయం తీసుకుని అప్పుడు స్టార్ట్ చేయాలి. ఒకవేళ హైడ్రో లాక్ అయితే అప్పుడు మెకానిక్ సాయం తీసుకోవడం తప్పనిసరి.

వానాకాలంలో మాత్రం గూగుల్ మ్యాప్స్ లో చెప్పే తెలియని దారిలో కన్నా మీకు తెలిసిన దారిలో వెళ్లడమే సురక్షితం. ఎందుకంటే మ్యాప్స్ లో చూపించిన మార్గం ఒక్కోసారి బాగోపోవచ్చు. నీటితో నిండిన రోడ్డును దాటివచ్చిన తర్వాత ఓసారి బ్రేక్స్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాహనం కింది భాగంలో నీరు నిలిచే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు బ్రేకులు వేస్తే అవి జారిపోతాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే నీరు నిండిన రోడ్డుపై బండిని కంగారుపడకుండా ఓపికగా నడపాలి.