50 % కమీషన్ ఆరోపణలు – ప్రియాంకపై బీజేపీ కేసు

ప్రత్యర్థులపై బురదజల్లి వాళ్లనే కడుక్కోమనడం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటే. నిరాధారమైన ఆరోపణలు చేసి అవి నిజం కాదని ప్రత్యర్థులనే ప్రూవ్ చేసుకోమంటుంటారు. ఇప్పుడు ప్రియాంకాగాంధీ అదే పని చేశారు.కాకపోతే ఈ సారి బీజేపీ ఆమెపై కేసు పెట్టింది. చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు సమర్పించాలని అనడంతో కాంగ్రెస్ పార్టీ పని సూప్ లో పడినట్లయ్యింది…

మధ్యప్రదేశ్లో కమీషన్ల రాజ్యం అంటున్న ప్రియాంక

రెండు రోజుల క్రితం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఓ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుతంపై అందులో తీవ్ర ఆరోపణలు చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఏ పని చేయాలన్నా కాంట్రాక్టర్లు 50 శాతం కమీషన్ ఇవ్వాలని ఆమె అన్నారు. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారని కూడా ప్రియాంక చెప్పుకొచ్చారు. కర్ణాటకలో 40 శాతం కమీషన్ బ్యాచ్ ను జనం ఇంటికి పంపించారని మధ్యప్రదేశ్లో కూడా 50 శాతం కమీషన్ టీమ్ ను త్వరలోనే సాగనంపుతారని ఆమె హెచ్చరించారు.

ప్రియాంకపై ఫిర్యాదుల వెల్లువ

మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ప్రియాంక చేసిన ఆరోపణలను ఖండిస్తూ బీజేపీ నేతలు వేర్వేరు పోలీసు స్టేషన్లలో కేసు వేశారు. భోపాల్, ఇండోర్ సహా అనేక చోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రియాంకాగాంధీ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ యాదవ్ పై కూడా కేసు పెట్టారు. బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ నితేష్ పాఠక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ ముగ్గురు నేతలతో పాటు తొలుత ఆ వ్యవహారాన్ని ట్వీట్ చేసిన గ్యానేంద్ర అవస్తీ అనే వ్యక్తిపై కూడా కేసు పెట్టామని ఇండోర్ పోలీస్ కమిషనర్ల వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, బీజేపీపైనా నిరాధారమైన ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్షన్ 420 (చీటింగ్) సెక్షన్ 469 (ఫోర్జరీ) కింద కేసు పెట్టినట్లు పోలీసు శాఖ వెల్లడించింది. ఆయా నేతల ట్విటర్ ఖాతాలు, వాటిని నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ అంటోంది.

అసత్యప్రచారమే వారి లక్ష్యమంటున్న శివరాజ్ సింగ్ చౌహాన్

కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలతో బీజేపీ ఇమేజ్ న దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వారి కోరిక ఎప్పటికి నెరవేరదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎదురుదాడి చేశారు. 50 శాతం కమీషన్ ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను ప్రియాంకాగాంధీ సమర్పించకపోతే కఠిన చర్యలు తప్పవని బీజేపీ అంటోంది. ఈ విషయాన్ని తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదని మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా తేల్చేశారు. మరో పక్క ప్రియాంకపై గ్వాలియర్ లో కూడా కేసు నమోదైంది.