మ్యూజిక్ డైరెక్టర్స్ లో తిరుగులేని క్రేజ్ ఎవరిదంటే ఠక్కున చెప్పే పేరు రెహమాన్. మూడు దశాబ్ధాలుగా రెహమాన్ ని మించి అనిపించే మరో సంగీతదర్శకుడి పేరు వినిపించలేదు. కానీ ఇప్పుడిప్పుడే ఈ రేంజ్ కి చేరుకుంటున్నాడు మరో యంగ్ తరంగ్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరే అనిరుధ్ రవిచంద్రన్…
రెహమాన్ తర్వాత అనిరుధ్
సౌత్, నార్త్ ను దాటుకుని హాలీవుడ్ రేంజ్ కి వెళ్లిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. భారతీయ సినిమాను ఆస్కార్ వేదికపై నిలబెట్టిన సంగీత దర్శకుడిగా రెహమాన్ అందుకున్న కీర్తి అనంతం. రెహమాన్ తర్వాత ఈ ముఫ్పై ఏళ్లలో ఏ సంగీత దర్శకుడు కూడా ఆ రేంజ్ ని అందుకోలేకపోయాడు. కానీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనిరుధ్ రవిచంద్రన్ మరో రెహమాన్ అవుతాడని ఫిక్సైపోయారు సినీ ప్రియులు. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో అనిరుధ్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రజనీకాంత్ రీసెంట్ హిట్ జైలర్ మూవీకి కూడా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. జైలర్ మూవీ పాజిటివ్ టాక్ లో ఫస్ట్ చెప్పే మాటే అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్ గురించే. ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వైపు అడుగులేస్తున్నాడు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ జవాన్ కి మ్యూజిక్ అందిస్తోన్నది అనిరుధ్ . ఇప్పటికే విడుదలైన సాంగ్స్ తో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని అనిరుధ్ ఆకర్షించాడు. జవాన్ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిస్తే ఇక బీటౌన్లో అనిరుధ్ కి తిరుగుండదు..
టాలీవుడ్ లోనూ అనిరుధ్ బిజీ
తమిళం, హిందీలోనే కాదు తెలుగు లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాకి కూడా అనిరుధ్ స్వరాలందిస్తున్నాడు. వీటితో పాటూ మరో రెండు మూడు పెద్ద ఆఫర్లు కూడా రెడీగా ఉన్నాయి. తాజాగా జైలర్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చూసి ఫిల్మ్ మేకర్స్ కి మోస్ట్ వాంటెండ్ కంపోజర్ అయిపోయాడు. అంతే కాకుండా రెహమాన్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మ్యూజిక్ కంపోజర్ కూడా నిలిచాడు. రెహమాన్ ఫేడ్ ఔట్ అవ్వకుండానే మరో రెహమాన్ అంటూ అనిరుధ్ కు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరి ఈ రేంజ్ అంచనాలను అనిరుధ్ అందుకుంటాడా … వెయిట్ అండ్ సీ..