మాజీ ముఖ్యమంత్రి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేత, వెండితెర మేరునగధీరుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఎన్టీ రామారావుకు కేంద్రం అరుదైన గౌరవం ఇస్తోంది. ఆయన శతజయంతి సందర్భంగా రూపొందించిన వంద నాణెన్ని ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఆవిష్కరించనున్నారు. రాష్ట్రపతి ముర్ము.. రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో ఈ నాణెన్ని విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా హాజరవుతారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నాణెం
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు పేరుతో రూ.100 నాణేన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో రూ.100 నాణేన్ని ముద్రించింది. అయితే ఈ నాణేన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం నుంచి ఈ మేరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.
ప్రత్యేక లోహాలతో నాణెం తయారీ
ఈ వంద రూపాయల ఈ కాయిన్ 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి అలాగే 40 శాతం రాగీ ఉండనుంది.అలాగే ఐదు శాతం నికెల్ ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం మరోవైపు ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ,భాషలలో 1923-2023 అని ముద్రించినట్లుగా ఆర్బీఐ తెలిపింది.
పురందేశ్వరి ప్రత్యేక చొరవ
ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. పదేళ్లుగా బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్న ఆమె నాణెం విడుదలకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నాణెం ఎలా ఉండాలన్నది కూడా ఆర్బీఐ ఆమెతోనే సంప్రదించింది. రాష్ట్రపతి భవన్ లో జరిగే నాణెం ఆవిష్కరమ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా హాజరయ్యే అవకాశం ఉంది. తెలుగువారిని .. దిగ్గజాలను గౌరవించడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుంది.