భారతీయులకు..ముఖ్యంగా హిందువులకు లక్ష్మీదేవి అంటే ఉండే భక్తి అంతా ఇంతా కాదు. ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి కరుణిస్తే చాలు జీవితం ప్రశాంతంగా సాగిపోతుందని భావిస్తారు. అందుకే మహాలక్ష్మి కరుణా కటాక్షాలకోసం ఎన్నో ఎన్నో నియమాలు పాటిస్తారు. అలాంటి లక్ష్మీదేవిని మనదేశంలోనే కాదు ముస్లింలు అధికంగా ఉండే ఇండోనేషియాలోనూ విస్తృతంగా ఆరాధిస్తున్నారు.
మనకు లక్ష్మీదేవి అక్కడ దేవిశ్రీ
శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వివిధ దేశాల్లో వివిధ పేర్లతో ఆరాధిస్తారు. నేపాల్, టిబెట్లలో వసుంధర పేరుతో, ఇండోనేషియాలో దేవిశ్రీ పేరుతో ఆరాధిస్తారు. ఇప్పుడంటే సంపదని బంగారంగాను, డబ్బుగాను గుర్తిస్తున్నారు కానీ కానీ ఒకప్పుడు సంపద అంటే ధాన్యమే. ధాన్యం సమృద్ధిగా పండితేనే రాజ్యాలు సుభిక్షంగా ఉండేవి. అలా నిండైన ధాన్యపురాశులతో రాజ్యం తులతూగాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలని నమ్మేవారు ఇండోనేషియా ప్రజలు.
దేవిశ్రీ ఆవిర్భావం వెనుక రెండు కథలు
మొదటి కథ ప్రకారం – ఒకప్పుడు ఈ భూమ్మీద చెరుకు మాత్రమే పండేదట. ప్రజల ఆకలి తీరకపోవడంతో సమస్యకు పరిష్కారం చూపమంటూ శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు జనం. అప్పుడు శ్రీ మహావిష్ణువు భూదేవిని వివాహం చేసుకున్నాడు. అలా సాఫల్యతకు చిహ్నమైన భూదేవి నుంచి ధాన్యం ఉద్భవించాయని విశ్వసిస్తారు.
రెండో గాథ ప్రకారం లక్ష్మీదేవి ఒక నాగదేవత కన్నీటి నుంచి ఉద్భవించింది. అంతా ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. శ్రీ మాహావిష్ణువు మోహించాడని తెలిసినా ఆమెకు పెళ్లి చేయడం ఇష్టంలేక విషయం ఇచ్చారట. అయినా కూడా ఆ తల్లి ఈ లోకానికి వరాలనే ఒసగాలని అనుకుంది. అలా ఆమె దేహం నుంచి రకరకాల ఫలపుష్పాలు ఉన్న మొక్కలు ఉద్భవించాయి. వాటితో పాటుగా ధాన్యపు మొక్కలు కూడా ఉద్భవించింది. అలా ప్రజల ఆకలి తీర్చేందుకు లక్ష్మీదేవి ధాన్యం రూపంలో ఉద్భవించిందని భావిస్తారు.
అమ్మవారి చేతుల్లో కొడవలి
ఇండోనేషియా ముస్లింలు అధికంగా ఉండే దేశం. కానీ ఇప్పటికీ అక్కడ ఈ దేవిశ్రీ ఆరాధన విస్తృతంగా కనిపిస్తుంది. పొలాలలో అమ్మవారికి చిన్న గుడి కట్టి..అమ్మవారి ప్రతిమ తయారు చేసి ఆమె చేతుల్లో కొడవలిని ఉంచుతారు. పొలం గట్ల మీద కూడా కొబ్బరి ఆకులతో దేవిశ్రీని తయారు చేసి ఆమెకు నమస్కరించిన తర్వాత పొలం పనులు మొదలు పెడతారట. ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతోందక్కడ. వీరికి కూడా శుక్రవారమే ప్రత్యేకం.
లోకాలను కాచే ఆదిపరాశక్తి అమ్మవారికి ఒక్కో ఊర్లో ఒక్కో పేరు. పేర్లు మాత్రమే వేరు కానీ శక్తి మాత్రం ఒక్కటే.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.