అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్ సభలో మాటల తూటాలు పేలాయి. భరత మాతను చంపేశారంటూ కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశాన్ని సర్వనాశనం చేసినదీ కాంగ్రెస్ పార్టీనేనని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ బయటకు వెళ్తూ…వెళ్తూ ఫ్లయ్యింగ్ కిస్ ఇచ్చారని బీజేపీ మహిళా ఎంపీలు ఆరోపించారు. అదీ స్మృతీ ఇరానీని ఉద్దేశించిన చేసిన పని అని కూడా వారంటున్నారు. రాహుల్ పై స్పీకర్ కు ఫిర్యాదు కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఓ బీజేపీ ఎంపీ ప్రధాని మోదీని ప్రశంసించి, తాము ఎందుకు అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామో కూలంకషంగా వివరించిన అంశం మాత్రం జనం దృష్టికి వెళ్లినట్లుగా కనిపించలేదు..
వీగిపోతుందని తెలిసి కూడా…
తీర్మానం వీగిపోతుందని, బీజేపీకి పూర్తి మెజార్టీ ఉందని తెలిసి కూడా విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయని ఒడిశా అధికార పార్టీ బిజు జనతా దళ్ (బీజేడీ) ఎంపీ పినాకీ మిశ్రా గుర్తుచేశారు. సభా సమయాన్ని వృధా చేశారంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి విధ్వంసకర రాజకీయాల దేశానికి ఎలాంటి ప్రయోజనం కలిగించలేవని ఆయన అభిప్రాయపడ్డారు. భారీ మెజార్టీతో తిరస్కారానికి గురవుతుందని తెలిసి కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంలో తర్కం కనిపించడం లేదని పినాకీ మిశ్రా విశ్లేషించారు.
మోదీ నాయకత్వానికి ప్రశంసలు
పార్టీగా బీజేపీని తాము వ్యతిరేకిస్తామని, ప్రధాని మోదీ నాయకత్వం పట్ల మాత్రం తమకు విశ్వాసం ఉందని పినాకీ మిశ్రా వెల్లడించారు. మంచి వక్త అయిన మోదీ, సమ్మోహన్ ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకోగలరని ఆయన అన్నారు. గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఒడిశాకు ఆర్థికపరంగా అన్ని ప్రయోజనాలు చేకూర్చిందని ఆయన వివరించారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలను పటిష్టం చేయడంలో బీజేపీ తీరు ప్రశంసనీయమన్నారు. అవసరమైనప్పుడల్లా ఒడిశాకు గ్రాంట్లు అందుతున్నాయన్నారు. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో బీజేపీకి ఫుల్ మార్క్స్ పడతాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదు.
మణిపూర్ విషయంలో కేంద్రం చేయాల్సిందంతా చేస్తోందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారని పినాకీ మిశ్రా అంటున్నారు. వారి చర్యల వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. 50- 60 ఏళ్ల నుంచి వారసత్వంగా సంక్రమించిన వివాదాలను రాత్రికి రాత్రే పరిష్కారం కుదరదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.హోంమంత్రి అమిత్ షా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మణిపూర్ హింసపై పూర్తి వివరాలు అందించారని ఆయన గుర్తు చేశారు. రాజకీయనాయకులంతా కీచులాడుకునేకంటే.. ఒక గొంతుకై మణిపూర్ హింసను గర్హించాలన్నారు. అక్కడ రాష్ట్రపతి పాలన పెడితే పరిస్థితి అదుపుకు వస్తుందని తాను భావించడం లేదని, అలాంటివి వృథా ప్రయత్నాలే అవుతాయని పినాకీ మిశ్రా విశ్లేషించారు.