జనంలోకి వెళ్లేందుకు, ఇంటింటికి పోయి పార్టీ విధానాలను గుర్తు చేసేందుకు బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లోంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోయే ఛత్తీస్ గఢ్ లో పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసే దిశగా ప్రజల భాగస్వామ్యాన్ని ఆశిస్తోంది. ప్రతీ ఒక్కరినీ టచ్ చేసి బీజేపీ ప్రజాసంక్షేమ విధానాలకు వారి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉంది.
రాష్ట్రమంతా ఘోషనా పత్ర్ సుఝావ్ అభియాన్
బీజేపీ నేతలు రాష్ట్రంలో కొత్త ప్రచార వ్యూహాలను సిద్ధం చేశారు. ఘోషనా పత్ర్ సుఝావ్ అభియాన్ అంటే మేనిపెస్టో తయారు చేయడంలో ప్రజల సహాకారాన్ని పొందాలని తీర్మానించింది. పార్టీ కార్యకర్తలు నగరాలు, పట్టణాలు, గ్రామాలకు వెళ్లి సలహాలు అందుకుంటారు. అందుకోసం పెట్టేలు పట్టుకుని వెళతారు. జనం తమ సలహాలు రాసి అందులో వేయాల్సి ఉంటింది. జనం నుంచి నేరుగా సలహాలు పొంది వాటి ఆధారంగా మేనిఫెస్టో రూపొందించే ప్రయత్నం ఇది..
ఈ మేయిల్, వాట్సాప్ లో సైతం
బాక్సుల్లో వేయదలచుకోలేని వాళ్లకు మరో ఆప్షన్ కూడా ఇచ్చారు. వాళ్లు ఈ మేయిల్, వాట్సాప్ ద్వారా కూడా తమ విలువైన సలహాలు నమోదు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రజలంతా ఈ మహోద్యమంలో భాగస్వాములు కావాలని ఛత్తీస్ గడ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో పిలుపునిచ్చారు. ముఖ్యంగా రైతుల నుంచి సలహాలు పొందితే వారికి కావాల్సిన పనులు చేసే వీలుంటుందని మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ అయిన మాజీ ఎంపీ విజయ్ భాగేల్ అంటున్నారు. రాష్ట్రంలో మెజార్టీ వర్గమైన వ్యవసాయదారులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన అంటున్నారు.2003 నుంచి ఇలాంటి ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ఈ సారి మాత్రం భారీ స్థాయిలో అమలు చేయబోతున్నామని బీజేపీ ఛత్తీస్ గఢ్ ఇంఛార్జ్ ఓం మాధుర్ చెబుతున్నారు. పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా కూడా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని నేతలు ఎదురు చూస్తున్నారు.
కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టేందుకేనా…
మేనిఫెస్టో రూపకల్పన పేరుతో జనంలోకి వెళ్లడం వెనుక బీజేపీ నేతలు భారీ వ్యూహం దాగొన్నదని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనంలోకి వెళ్లి అభిప్రాయాలు సేకరించే దిశగా కాంగ్రెస్ పార్టీ దుష్ట పరిపాలనను కూడా ఎండగట్టి జనాన్ని తమ వైపుకు తిప్పుకునే వీలుంటుందని నేతలు భావిస్తున్నారు.ఛత్తీస్ గఢ్ లో రూ 2 వేల కోట్ల లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపణలున్నాయి. అందులో ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ కు అత్యంత సన్నిహితుల ప్రమేయం ఉందని కూడా చెబుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ దిశగా అరెస్టులు కూడా చేశారు. ఈ విషయాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. అసలు సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాటతప్పిన సంగతిని కూడా ప్రచారం చేస్తారు. జలజీవన్ స్కీమ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో కూడా అవకతవకలు జరిగాయి . కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్ గఢ్ ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ స్వయంగా ఆరోపించారంటే పరిస్తితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.