సకల జనుల మద్దతుతో సాధించిన తెలంగాణను..కేసీఆర్ తన విజయంగా భావిస్తున్నారు. తెలంగాణ సాధించినట్లుగానే ఢిల్లీ పీఠాన్ని అందకోలేనా అని ఆయన మొండిగా ఉన్నారు. తెలంగాణను సాధించినట్లే… ప్రధాని పీఠాన్ని అందుకుంటానని ఆశపడుతున్నారు. కానీ ఆయన అధికార మత్తులో ఉన్నారని.. వాస్తవాలు అర్థం చేసుకోలేకపోతున్నారని సులువుగా అర్థమైపోతుంది.
కూటముల శకం ఇంకా ఉందా ?
2018లో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ , బీజేపీలు మెజార్టీకి దూరంలో ఆగిపోయాయి. ఏ పార్టీతో కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే సీట్లు జేడీఎస్ కు వచ్చాయి. దాంతో వాళ్లకూ.. వీళ్లకు ఎందుకు.. మాకే ముఖ్యమంత్రి పదవి జేడీఎస్ చీఫ్ కుమారస్వామి అంటే… బీజేపీకి అధికారం దక్కకూడదని కాంగ్రెస్ సరే అన్నది. అప్పట్నుంచి చాలా ప్రాంతీయ పార్టీలకు కుమారస్వామి ఆదర్శం అయ్యారు. ఇది రాష్ట్రాల రాజకీయం .. దేశ రాజకీయాలను చూస్తే.. 1990ల్లో సంకీర్ణ శకం నడిచింది. అప్పట్లో ఏ జాతీయ పార్టీ కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించడం అసాధ్యంగా మారింది. ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషించడం ప్రారంభించాయి. ఇలా ఏర్పడిన కూటమల్లో ప్రాంతీయ పార్టీల నుంచి ఇందర్ కుమార్ గుజ్రాల్ , దేవేగౌడ ప్రధానమంత్రులు అయ్యారు. అప్పట్నుంచి ప్రాంతీయ పార్టీలకు ఆశ పెరిగిపోయింది.
మహారాష్ట్రలో ఒక్క సీటు అయినా వస్తుందా ?
మహారాష్ట్ర నుంచి కొంత మంది నేతల్ని పిలిపించుకుని కండువాలు కప్పినంత మాత్రాన అక్కడి ప్రజలు అన్ని సీట్లు కేసీఆర్కు ఇచ్చేయరు. కేసీఆర్ ఎంత లేదన్న తెలంగాణ ఉద్యమనేత. తనను తాను జాతీయ నేతగా ప్రొజెక్ట్ చేసుకున్నా.. తెలంగాణ మోడల్ అంటూ.. ప్రతి కుటుంబానికి లక్షలు పంచుతున్నానని ప్రకటించుకున్నా.. మహారాష్ట్రకు సంబంధించినంత వరకూ కేసీఆర్ పరాయి నేతే. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓ ప్రజాదరణ ఉన్న నాయకుడు లభిస్తే.. అప్పుడు కాస్త ఆశలు పెట్టుకోవచ్చు. కేసీఆర్నే చూపించి అక్కడ ఓట్లు పొందడం అసాధ్యం. ఎలా చూసినా… ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మహారాష్ట్రలో అసలు బీఆర్ఎస్ లెక్కలో లేదు.
తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయో కేసీఆర్కు తెలుసా ?
మహారాష్ట్ర సంగతి పక్కన పెడితే తెలంగాణలో కేసీఆర్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందా అంటే … రెండో సారి గెలిచి మంచి ఊపులో ఉన్నప్పుడే సారు , కారు , పదహారు అనే నినాదం తలకిందులయింది. కరీంనగర్, నిజామాబాద్ వంటి కంచు కోటల్ని కోల్పోయారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆ మాత్రం మద్దతు అయినా వస్తుందో రాదో అంచనా వేయడం కష్టమంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం అన్ని సీట్లు తన ఖాతాలోనే వేసుకుని ప్రధాని పీఠం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్రంలో హంగ్ వస్తే సంకీర్ణ రాజకీయంలో ఎవరు ప్రధానమంత్రి అవుతారో.. ఎవరికి అదృష్టం పడుతుందో అంచనా వేయడం కష్టం. చక్రం తిప్పే వారిదే రాజ్యం అవుతుందని అది తానేనని ఆశలు పెంచుకుంటున్నారు.