బీజేపీ కొత్త నినాదం మోదీ కీ గ్యారెంటీ

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వం దూసుకెళ్తోంది. ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టే విధంగా సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా ఇలాంటి వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీయే నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఎంపీలతో మోదీ కీలక భేటీలు

ఎంపీలను ఉత్తేజ పరిచేందుకు వారిని 11 గ్రూపులుగా విభజించి వేర్వేరుగా మోడీ సమావేశమవుతున్నారు. తాజాగా జరిగిన ఒక సమవేశం తన పేరు చెప్పి జనంలోకి వెళ్లాలని మోదీ సూచించారు. మోదీ కీ గ్యారెంటే అంటే మోదీ ఇస్తున్న హామీ అనే నినాదంతో క్షత్రస్థాయిలో తిరగాలని ఆయన ఆదేశించారు. గుజరాత్ ఎంపీలతో ఓ సారి రాజస్థాన్, గోవా ఎంపీలతో మరోసారి భేటీ అయిన ఆయన తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని వాడవాడల తీసుకెళ్లాలని చెప్పారు.

పేదలకిచ్చే స్కీములే వారికి శ్రీరామరక్ష

పేద ప్రజానీకానికి ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న స్కీములతో వాళ్లు చీకుచింతా లేకుండా జీవిస్తున్నారని మోదీ ప్రస్తావించారు. రైతులకు ఇచ్చే ఆరు వేల రూపాయలు వారి వ్యవసాయ పనులకు ఉపేయోగపడుతున్నాయని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్పత్తిని పెంచగలుగుతున్నారని పీఎం అన్నారు. ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రతీ పేదవాడికి ఆరోగ్య బీమా అందుతోందని ఎలాంటి వైద్య చికిత్స అయినా అందుబాటుకు వచ్చిందని మోదీ గుర్తు చేశారు. ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నామన్నారు. అదే మోదీకి గ్యారెంటీ అవుతుందని ప్రధాని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న ఈ స్కీములు తాము మళ్లీ అధికారానికి వచ్చిన తర్వాత సమర్థంగా కొనసాగిస్తామని చెప్పారు. ఆ సంగతి మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రచారం చేయగలిగితే ఎన్డీయేకు ఢోకా ఉండదని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రతీ ఒక్క స్కీములో ఉన్న విశిష్టతను మోదీ స్వయంగా వివరిస్తూ అవన్నీ ప్రజా సంక్షేమం కోసమే తప్ప.. విపక్షాలు అధికారం కోసం చెప్పుకునే ఫ్రీబీస్ కాదని ఆయన అన్నారు.

వారసత్వ పాలనపై సమరశంఖం పూరించాలని ఆదేశం

దేశంలో ఇకపై వారసత్వ రాజకీయాలకు చోటు లేదని మోదీ తేల్చేశారు. వారసులను రాజకీయాల్లో నిలబెట్టి అందు కోసం అడ్డదారులు తొక్కే వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఇదే ఎన్డీయే వారి ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఒకటి కావాలని ప్రధాని ఆకాంక్షించారు. ఎలాంటి సమర్థ లేకుండా, ప్రజా సేవ చేయకుండా నేరుగా తల్లిదండ్రులను అడ్డుపెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చే వారిని ప్రోత్సహించడం సరికాదని మోదీ చెప్పారు. కష్టపడి తెచ్చుకున్న స్వాతంత్ర్యం రాజకీయ వారసుల కోసం కాదని బీజేపీ వాదిస్తోంది. వారసత్వ రాజకీయాల వల్ల రాజకీయాల్లో కొన్ని కుటుంబాలు శాశ్వతంగా స్థిరపడిపోతున్నాయని, అవినీతి పెరుగిపోతోందని ఆయన అన్నారు. ఆయా నేతలు రాజకీయాల్లో స్థిరపడేందుకు కులం ఆధారంగా, మతం ప్రాతిపదికన ఓటర్లను రెచ్చగొడుతున్నారని అది ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని మోదీ అన్నారు.