ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఆదివాసీ ఓట్లకు పార్టీల గాలం

మధ్యభారతంలో ఛత్తీస్ గఢ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా, రూపు మార్చుకున్న కొన్ని పార్టీలు మూడో కూటమిగా రంగంలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒడిశా తర్వాత ట్రైబల్ స్టేట్ గా పిలిచే ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో పార్టీలు ఇప్పుడు ఎస్టీ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. సాంప్రదాయ రెండు పార్టీలతో పాటు ఆదివాసీలకు ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పే పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి..

పోటీలో సర్వ ఆదివాసీ సమాజ్..

ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబరు లోపు జరగాలి. అక్కడ 32 శాతం జనాభా ట్రైబల్స్ అని తేల్చడంతో విజయావకాశాలు వారి ఓట్లపైనే ఆధారపడి ఉంటాయని చెప్పక తప్పదు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 29 గిరిజన సెగ్మెంట్లు కాగా…. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ 25 చోట్ల గెలిచింది. ఈ సారి అంత సీన్ ఉండదని చెబుతూ కొన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పుకునే సర్వ ఆదివాసీ సమాజ్ (ఎస్ఏఎస్) ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. ఎస్ఏఎస్ పేట్రన్ అయిన కేంద్ర మాజీ మంత్రి అరవింద్ నీతమ్ అన్ని తానై చూసుకుంటున్నారు. గిరిజనుల కోసం రిజర్వ్ చేసిన 29 స్థానాల్లో వారి జనాభా 40 శాతం పైగా ఉన్నందున తమ అభ్యర్థులు ఈ సారి సునాయాసంగా గెలుస్తారని ఆయన చెబుతున్నారు.

బస్తర్ ప్రాంతమే కీలకమా…

నీతమ్ 1977 నుంచి 1996 వరకు బస్తర్ లోక్ సభా స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు కేబినెట్లో మంత్రిగా చేశారు. ఇప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ లో 12 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్న ఆయా స్థానాలు వచ్చే ఎన్నికలో తమకు హస్తగతమవుతాయని ఎస్ఏఎస్ నేతలు చెబుతున్నారు.

గిరిజన పార్టీలతో పొత్తుకు జేసీసీ ప్రయత్నాలు

మాజీ ముఖ్యమంత్రి, మాజీ కాంగ్రెస్ నేత అయిన దివంగత అజిత్ జోగి ప్రారంభించిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్ (జేసీసీ) ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. 2020లో అజిత్ జోగి మరణానికి ముందు 2018లో ఆ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలుండేవారు. అందులో ఇద్దరు చనిపోవడంతో నిర్వహించిన ఉప ఎన్నికల్లో జేసీసీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. మరో ఇద్దరు పార్టీ మారడంతో ఇప్పుడా పార్టీకి కేవలం ఒక్క ఎమ్మెల్యే మిగిలారు. అజిత్ జోగి కుమారుడైన మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగి ప్రస్తుతం జేసీసీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఎన్నికల్లో ట్రైబల్ పార్టీలైన ఎస్ఎఎస్, గోండ్వానా గణతంత్ర పార్టీ (జీజీపీ)తో కలిసి పోటీ చేసేందుకు ఆయన చర్చలు జరుపుతున్నారు. గిరిజన పార్టీలన్నీ కలిస్తే 29 స్థానాలనూ కైవసం చేసుకోవచ్చని, అప్పుడు ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించే వీలుంటుందని అమిత్ జోగి వాదిస్తున్నారు. పొత్తుపై ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఆదివాసీ సంక్షేమాన్ని కాంక్షించే ఒక మేనిఫెస్టో రూపొందిస్తామని ఆయన వెల్లడించారు.