అన్నం తింటే లావైపోతారని టిఫిన్లు లాగిస్తున్నారా!

మూడు పూటలా అన్నం తింటే లావైపోతారనే ఆలోచన చాలామందిలో ఉంది. అందుకే రెండు పూటలా టిఫిన్లు తిని ఒక పూట అన్నం తినేవారి సంఖ్య పెరిగింది. కానీ ఇది ఎంతవరకూ మంచిది…నిత్యం టిఫిన్లు తినడంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

ఇప్పుడు నలభై ఏళ్లొస్తే చాలు ఎవరిపని వాళ్లు చేసుకోలేకపోతున్నారు కానీ అప్పట్లో 90 ఏళ్లు వచ్చినా ఎంచక్కా తిరిగేసేవారు. ఇన్ని మార్పులకు కారణం ఆరోగ్య అలవాట్లే. పాత కాలంవారు తీసుకునే చద్దన్నం, జొన్న గటక, రాగి సంగటిలో పోషకాలు మెండుగా ఉండేవి. కానీ నేటి తరం మాత్రం అన్నం తింటే లావైపోతాం అనే ఆలోచనలో ఉన్నారు. కాఫీ, టీ, సూప్స్ తో కడుపునింపుకునేవారు కొందరైతే… ఓ పూట అన్నం తిని మిగిలిన రెండు పూట్లా టిఫిన్లు తినేవారు ఇంకొందరు. ఇవన్నీ ఆరోగ్యానికి మంచివేనా అంటే అస్సలు కాదని కరాఖండిగా చెప్పేస్తున్నారు ఆరోగ్య నిపుణులు

టిఫిన్ల వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది
రోజూ పొద్దున్నే టిఫిన్ తింటారంతా. ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఇలాంటివి తినడం వల్ల ఆకలి చచ్చిపోతుంది. అంత త్వరగా ఆకలి వేయదు కానీ ఫలితంగా జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఏప్పుడో ఓసారి తినొచ్చు కానీ నిత్యం పొద్దున్నే టిఫిన్లు తినడం వల్ల అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఉదయాన్నే పల్చని మజ్జిగ కలుపుకుని రెండు ముద్దలు అన్నం తింటే మధ్యాహ్నానికి ఆకలి పుడుతుంది. మధ్యాహ్నం మాత్రం అస్సలు తగ్గకుండా కడుపునిండా తినేసి మళ్లీ రాత్రి మాత్రం పళ్లు తినొచ్చు లేదంటే తేలిగ్గా జీర్ణమయ్య ఆహారం ఏదైనా అది కూడా పెందళాడే తినేయాలి

వాత వ్యాధులు-కీళ్ల నొప్పులు
ఉపవాసం, ఒక్క పొద్దు భోజనం పేరుతో టిఫిన్లు తింటుంటారు. వాస్తవానికి ఉపవాసం వెనుకున్న ఆంతర్యమే ఆరోగ్య రక్షణ. అలాంటిది ఇడ్లీ, దోశ, బోండా, చపాతీ, పరోటా తినేస్తే ఏం లాభం. సాధారణంగా అన్నం తిన్న దానికంటే ఎక్కువ నష్టం కలుగుతుంది. మిగిలిన టిఫిన్లో పోలిస్తే ఇడ్లీ మంచిదే కానీ దీంట్లో సాంబారు, అల్లం చట్నీ, కారం, నెయ్యి ఇలా అన్నిటిని కలిపి తినటం వలన కడుపులో అసిడిటీ పెరిగిపోతుంది. అలాగే బియ్యం కన్నా మినపప్పు లో ఎక్కువ కాలరీలు ఉంటాయి. ఇవి షుగర్‌ను పెంచుతాయి. ఇలా ప్రతి రోజు టిఫిన్స్‌ తినడం వలన పేగులు తన శక్తిని కోల్పోతాయి. వాత వ్యాధులు, కీళ్ల నొప్పులు లాంటివి వస్తాయి. అందుకే వారానికి ఓ రెండుసార్లు పర్వాలేదు కానీ నిత్యం టిఫిన్లు తినడం సరికాదంటారు ఆరోగ్యనిపుణులు. రాత్రి మిగిలిన అన్నాన్ని పెరుగులో కలిపి పెట్టుకుని మార్నింగ్‌ తినటం, లేదంటే మొలకెత్తిన గింజలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి తినటం అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పులు గమనించొచ్చు. నిత్యం ఇడ్లీ, దోశ, వడ. పూరి, పరోటలాంటివి తినేవారు డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.