కార్తీ చిదంబరానికి బీజేపీ గట్టి కౌంటర్

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఫ్యామిలీ ఎప్పుడు దిగజారుడుగానే ప్రవర్తిస్తుంది. అద్దాల మేడలో కూర్చుని దారిన వెళ్లే వారి మీద రాళ్లు వేస్తూ ఉంటుంది. గురువిందకున్న నలుపు తెలియదన్నట్లుగా ఎప్పుడు ఇతరుల తప్పులు వెదుకుతూ ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా కాకుండా అవసరానికి మించి మాట్లాడుతూ ఉంటుంది. ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా తండ్రి పళణియప్పన్ చిదంబరం, తనయుడు కార్తీ చిదంబరం తీరులో మార్పు మాత్రం కనిపించదు.

ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పోలిక..

రాజకీయ అనుభవం లేని కార్తీ చిదంబరం తనకు తోచినట్లుగా స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు. మోదీపై కామెంట్స్ కు సంబంధించి రాహుల్ గాంధీ శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఉబ్బితబ్బిబవుతున్న కాంగ్రెస్ నేతల్లో కార్తీ చిదంబరం కూడా ఒకరు. సరిగ్గా అప్పుడే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మూడేళ్ల జైలు శిక్ష్ విధించింది కార్తీ చిదంబరం ఈ రెండు కేసులను ముడిపెడుతూ ఒక ట్వీట్ చేశారు. ఐదేళ్ల పాటు ఇమ్రాన్ ఖాన్ పై విధించిన అనర్హత వేటును ప్రస్తావిస్తూ విపక్ష నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు పాకిస్థాన్ కూడా ఇండియన్ మోడల్ ను అమలు జరుపుతోందని కార్తీ చిదంబరం ఆరోపించారు.

కార్తీ కూడా జైలుకెళ్లొచ్చారుగా…

కార్తీ మాటలను బీజేపీ కాస్త సీరియస్ గానే తీసుకుంది. ఆయన అర్థం పర్థం లేని పోలికలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత ఆర్పీ సింగ్ సమాధానమిచ్చారు. ఒకప్పుడు అవినీతి కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన కార్తీ చిదంబరానికి మాట్లాడే హక్కే లేదని ఆయన తేల్చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను తోషా ఖానా కేసులో అరెస్టు చేశారని, రాహుల్ గాంధీ కేసు మోదీ ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం దావా అని ఆయన గుర్తు చేశారు. అసలు రెండు కేసుల మధ్య తేడా ఏమిటో, పోలిక ఏమిటో కార్తీ చిదంబరానికి తెలుసా అని సింగ్ ప్రశ్నించారు.

ఇమ్రాన్ కేసు ఏమిటి..

ప్రధాన మంత్రిగా ఆయనకు వచ్చిన బహుమతులు ప్రభుత్వానికే చెందుతాయని తెలిసినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ వాటికి అమ్మేసుకున్నారు. అందులో రోలెక్స్ గడియారాలు, ఉంగరాలు, కఫ్ లింక్స్ లాంటివి ఉన్నాయి. వాటి విలువ ఆరున్నర లక్షల డాలర్లుంటుంది. అంటే దాదాపు అరవై లక్షల రూపాయలన్నమాట. పాకిస్థాన్ ప్రధాన మంత్రులుగా చేసిన వారిలో చాలా మంది అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాధారులున్నాయి. గతంలో నవాజ్ షరీఫ్ పై కూడా అవినీతి కేసులున్నాయి. ఇమ్రాన్ పాలనా కాలంలో ఆశ్రిత పక్షపాతం, పార్టీ వారికి దోచి పెట్టడం లాంటి ఆరోపణలు వచ్చాయి.