పరమేశ్వరుడు-పార్వతీదేవి ముద్దుల తనయుడు సుబ్రమణ్యస్వామికి ఎన్నో పేర్లు ఉన్నాయి. కుమార, కుమరన్, కుమార స్వామి, స్కంద, షణ్ముఖ, షణ్ముఖుడు, శరవణ, శరవణన్, గుహన్ మురుగ, మురుగన్ సహా ఇంకా ఎన్నో పేర్లున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో కుమారస్వామి వైభవమే వేరు. పళని ఆలయం మరింత ప్రత్యేకం. ఆ క్షేత్రం విశిష్ఠత ఏంటంటే..
శివుడు ఇచ్చిన ఫలమే ‘పళని’
విఘ్నాధిపత్యం కోసం పెట్టిన పరీక్షలో భాగంగా ఎవరైతే ముందుగా యావత్తు విశ్వానికి ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తానంటాడు. వినాయకచవితి కథల్లో భాగంగా ఇది అందరూ చదువుకున్నదే. కుమారస్వామి తన వాహహనం అయిన నెమలిపై విశ్వాన్ని చుట్టివచ్చేందుకు బయలుదేరుతారు. వినాయకుడు మాత్రం విశ్వరూపులైన తన తల్లి, తండ్రి చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భత ఫలాన్ని పొందుతాడు. విశ్వప్రదిక్షిణ పూర్తి చేసుకుని తిరొగొచ్చిన సుబ్రమణ్యస్వామి జరిగిన సంగతి తెలుసుకుని గణపతికి విఘ్నాధిపత్యం ఇచ్చేందుకు అంగీకరిస్తాడు. కానీ అలుగుతాడు. అప్పుడు శివుడు తన చిన్న కొడుకుని బుజ్జగించి నీకెందుకు చింత..నువ్వే ఒక అద్భుత ఫలానికి నీ పేరిట ఓ మహిమాన్విత క్షేత్రం ఏర్పడుతుందని అనుగ్రహిస్తాడు. అలా ఏర్పడిన క్షేత్రమే పళని. కుమారస్వామి స్వయంగా నివాసం ఉండే పుణ్యస్థలం ఇది.
మురుగన్ కొండ
ప్రకృతిశోభతో విలసిల్లే కొండపై ఉన్న ఈ ప్రదేశాన్ని ‘మురు గన్ కొండ’ అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసం ‘ఏరియల్ రోప్ – వే’ ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ చేసేవారికోసం చుట్టూ రోడ్ వేశారు. సాధారణంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత కొండ ఎక్కుతారు. మెట్లు ఎక్కి కొండపైకి చేరుకోగానే ముందుగా రాజగోపురం ఇంకొంచెం ముందుకు వెళితే వరవేల్ మండపం కనిపిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా ఉంటాయి
మురుగన్ విగ్రహం విశిష్టత
గర్భగుడిలో ప్రతిష్టితమైన కుమారస్వామి విగ్రహం 18 మంది సిద్ధులలో ప్రముఖుడైన భోగార్ పర్వవేక్షణంలో రూపొందించిన ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు. ‘నవ పాషాణం’ అనే విశేషమైన శిలను మలచి తయారు చేశారని, ఇందులో శక్తివంతమైన మూలికా పదార్థాలను నిక్షిప్తం చేశారంటారు. అందుకే స్వామివారికి పూజలో భాగంగా ధూప, దీప సమర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్రహం నుంచి మూలికా పదార్థం ఒక విధమైన వాయువులను వెలు వరిస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్ని వ్యాధులకు సంబంధించిన దోషాలు హరించుకుపోతాయి ఆరోగ్యవంతులవుతారని చెబుతారు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.