రెండు పడవలపై జనసేనాని రేస్ – రెండింటిలోనూ వెనుకబడిపోతున్నారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రెండు విడతల వారాహియాత్ర తర్వాత ఏం చేయాలన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఓ వైపు అంగీకరించిన సినిమాల షెడ్యూల్స్ పూర్తి చేయాల్సి ఉంది. మరో వైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ రెండు పడవలపై ప్రయాణం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. దేనికీ న్యాయం చేయలేకపోతున్నారేమోన్న అభిప్రాయంలో అటు పవన్ ఫ్యాన్స్ అటు జనసైనికులు గందరగోళానికి గురవుతున్నారు.

మంగళగిరిలోనే ఇక పవన్ ఉంటారని జనసేన ప్రకటన

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పర్మినెంట్ అడ్రస్ మారిపోయిందని.. ఆయన మంగళగిరికి మకాం మార్చేశారని జనసేన చెబుతోంది. షూటింగ్‌లకు మాత్రమే హైదరాబాద్ వెళ్తారు. ఇక అన్నిరకాల వ్యవహారాలు మంగళగిరి నుంచే నిర్వహిస్తారని అంటున్నారు. ఇటీవల కొంత మంది దర్శక నిర్మాతలు అమరావతి వచ్చి షూటింగ్‌లు కూడా అమరావతి చుట్టుపక్కలే చేస్తామనిచెప్పుకొచ్చారు. కానీ అది సాధ్యం కాదని క్లారిటీ రావడంతో ఇప్పుడు షూటింగ్‌ల కోసమే హైదరాబాద్ వెళ్తారని చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున రాజకీయం కోసం సమయం కేటాయిస్తున్నారు. కానీ కొన్ని సినిమాల కమిట్ మెంట్ విషయంలో పవన్ కల్యాణ్ కొంత సమయం కేటాయించక తప్పదు.

ఉస్తాద్ సినిమా కోసం డేట్లు కేటాయించిన పవన్

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మంచి పొలిటికల్ సెటైర్లు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. అందుకే దీన్ని ఎన్నికలకు ముందు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు కొన్ని రోజులు పవన్ కల్యాణ్ కేటాయించనున్నారు. ఇప్పటికే ఆ సినిమా యూనిట్ ఏర్పాట్లు చేసుకుంది. పవన్ ఎప్పుడు జాయిన్ అయితే అప్పుడు షూటింగ్ జరుగుతుంది. మరో వైపు మూాడో విడత వారాహియాత్రపై జనసేన యంత్రాంగం కసరత్తు జరుగుతోంది. గోదావరి జిల్లాల్లో ఇంకా సగం నియోజకవర్గాల్లో యాత్రను కవర్ చేయాల్సి ఉంది. అదే జిల్లాలో కొనసాగించాలా లేకపోతే జిల్లా మార్చాలా అన్నదానిపై చర్చలు జరుపుతున్నారు.

అభ్యర్థులపై క్లూలెస్‌గా పవన్

పవన్ కల్యాణ్ .. ప్రస్తుతం బలమైన నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని.. వాటిలో అభ్యర్థులపైనా చర్చలు జరిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పలువురు నేతలు వచ్చి పవన్ ను కలిసి వెళ్తున్నారు. పొత్తుల విషయంలో బయటకు పవన్ ఏం మాట్లాడుతున్నా..ఆయనకు స్పష్టత లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది. రెండు పడవలపై ప్రయాణం వల్ల పవన్ కల్యాణ్ దేనికీ న్యాయం చేయలేకపోతున్నారన్న భావన ప్రజల్లో పెరుగుతోందని.. బ్రో సినిమా ఫ్లాప్ తో.. ఇది మరింత ఇబ్బందికర పరిస్థితిని తెచ్చి పెడుతోందని అంటున్నారు. పవన్ ఇప్పుడైనా పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని జనసైనికులు కోరుకుంటున్నారు.