ప్రజల్లో సామాజిక స్పృహ పూర్తిగా తగ్గిపోతోంది. ప్రతీ అంశంలో సమాజాన్ని రెచ్చగొట్టడం, విధ్వంసం సృష్టించడం మామూలైపోయింది. గొడవలు మొదలుపెట్టడం ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి తగులబెట్టడం, కనిపించిన వారిని కొట్టి చంపెయ్యడం జరుగుతూనే ఉంది. ఎవరైనా అడిగితే దానికి మతం రంగు పులమటం కూడా పరిపాటిగా మారింది.
హరియాణాకు అదనంగా కేంద్ర బలగాలు
ఉత్తరాది రాష్ట్రం హరియాణాలో అల్లర్లు సృష్టించిన ప్రకంపలను కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. నూహ్ సహా అనేక చోట్ల ఇంకా ఉద్రిక్త వాతావరణమే ఉండటంతో కేంద్ర బలగాలను పంపాలని హరియాణా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అల్లర్ల కారకులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని హరియాణా సీఎం ఖట్టర్ నిర్ణయించారు. అల్లర్లపై ఢిల్లీలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. దానితో ముందు జాగ్రత్తగా దేశ రాజధానిలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. హరియాణా సరిహద్దుల్లో ఉన్న యూపీ జిల్లాలను అప్రమత్త చేశారు…
సోషల్ మీడియాలో దుష్ప్రచారమే శాపం
తొలి ఘర్షణ జరిగిన వెంటనే సోషల్ మీడియాలో ఉన్నవి లేనివి పోస్టులు పెట్టారని హరియాణా ప్రభుత్వం గుర్తించింది. కొంతమంది గుడ్డిగా వాటిని ఫార్వర్డ్ చేయడంతో గొడవలు పెరిగాయి. దానితో జూలై 21 నుంచి 31 వరకు అన్ని సోషల్ మీడియా పోస్టులను పరిశీలించి కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని ఆన్ లైన్ కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచినట్లు హరియాణా హోమ్ మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ప్రతీ ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకంటామన్నారు.
అల్లర్లకు పాల్పడిన వారే నష్టాన్ని భరించాలి..
అల్లర్లను ప్రేరేపించిన వారిపై, ఘర్షణలకు దిగిన వారిపై కఠినంగా వ్యవహరించాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించుకుంది. జరిగిన నష్టాన్ని వారి నుంచే వసూలు చేసే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఇందు కోసం 2021లో ప్రవేశ పెట్టిన ఒక చట్టాన్ని ఈ అల్లర్లకు అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 70 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని, 166 మంది అనుమానితులను అరెస్టు చేశామని వెల్లడించారు. నూహ్ లో 41 కేసులు, గురుగ్రామ్ లో 18 కేసులు విచారణలో ఉన్నాయి. మసీదులపై దాడులు జరిగిన ప్రదేశాల్లో ప్లాగ్ మార్చులు జరుగుతున్నాయి. అల్లర్ల ప్రభావం రాజస్థాన్ పై కూడా పడటంతో అక్కడ తొమ్మిది మందిని అరెస్టు చేశారు.