తాడిపత్రిలో జేసీకి గడ్డు పరిస్థితి – దూరమవుతన్న దగ్గరి అనుచరులు !

వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత జేసీ ఫ్యామిలీ తీవ్రంగా నష్టపోయింది. వ్యాపారాలన్నీ మూసివేతకు గురయ్యాయి. అయితే రాజకీయంగా ఎదుర్కొంటానని ఆయన చెబుతున్నారు. అనుకున్నట్లుగానే తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో ఆయన పార్టీని గెలిపించి.. మున్సిపల్ చైర్మన్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు మరోసారి పోటీ చేయబోతున్నారు. ఈ ఏర్పాట్లలో ఉండగానే ఆయనకు సొంత పార్టీ నేతలు ఝులక్ ఇస్తున్నారు.

జేసీకి దూరమవుతున్న అనుచరులు

అధికార వైసిపికి ధీటుగా నిలబడేందుకు జెసి కుటుంబం ప్రయత్నిస్తూ వస్తోంది. చిన్న అంశం దొరికినా అధికార పార్టీ నేతలపై విరుచుకుపడుతూ వస్తున్నారు. స్వల్ప మెజార్టీతోనే పురపాలక పీఠాన్ని దక్కించుకున్నప్పటికీ, తమ పార్టీ తరుపున గెలుపొందిన వారెవరూ జారిపోకుండా చూసుకోగలిగారు. తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జెసి.ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఛైర్మన్‌ అయినప్పటి నుంచి కూడా ఆ పార్టీ కౌన్సిలర్లతో పాలకవర్గాన్ని నడిపించే ప్రయత్నం చేశారు. అనూహ్యంగా టిడిపి కౌన్సిలర్‌ రాబర్టు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాడిపత్రికి చెందిన అయూబ్‌ అనే మైనార్టీ నాయకుడు కూడా టిడిపికి రాజీనామా చేశారు. ఈయన జెసి ప్రబాకర్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం మరో చర్చనీయాంశమైంది. ఆయన వల్లనే పార్టీకి నష్టం జరుగుతోందంటూ రాజీనామా అనంతరం ఆరోపించారు.

జేసీపై వైసీపీ గురి పెట్టి రాజకీయం చేస్తోందా ?

సొంత పార్టీ నుంచే వరుసగా మరో వ్యక్తి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వరుసగా సొంత పార్టీలో చోటు చేసుకుంటున్న రాజీనామాల పర్వం వెనుక కారణాలేమై ఉన్న్యా అన్న సందేహాలను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రత్యర్థుల ప్రమేయమం ఏమైనా ఉందా లేక స్వయం తప్పిదాలా అన్న చర్చ నడుస్తోంది. అటు పదవికి, ఇటు రాజకీయంగానూ రెండింటి ఒకేసారి దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాన్ని వారి అనుయాయులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తాడిపత్రిలో జరుగుతున్న ఈ పరిణామాలు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి.

జేసీ బ్రదర్స్ ఎలా ఎదుర్కొంటారో ?

జేసీ దివాకర్ రెడ్డికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో… గుండెకు రెండు స్టెంట్లు వేయడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు భారం అంతా జేసీ ప్రభాకర్ రెడ్డిపైనే పడింది. ఆయన అనుచరుల్ని రౌండప్ చేసి మరీ .. దూరం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయా అన్న చర్చ జరుగుతోంది.