రాత్రివేళ సర్పరూపంలో తిరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది!

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా ఆలయాలున్నాయి. ప్రతి ఆలయానికి స్థలపురాణం, క్షేత్ర విశిష్టత ఉన్నాయి. వీటన్నింటికీ భిన్నంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఉన్న ఈ ఆలయం…

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి,
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ

విజయవాడ- హైదరాబాద్ నేషనల్ హైవే జగ్గయ్యపేటకి సమీపం చిల్లకల్లుకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం చాలా ప్రసిద్ధి. తిరుమలగిరి గ్రామంలో ఉన్న ఈ దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని కృష్ణా జిల్లా భక్తులు మాత్రమే కాదు, ఖమ్మం, నల్గొండ, గుంటూరు జిల్లాల నుంచి భారీగా భక్తులు దర్శించుకుంటారు. గ్రామానికి ఉత్తరంగా తిరుమలగిరి పర్వతం ఉంది. అంటే పవిత్రమైన కొండ అని అర్ధం. పేరుకు తగ్గట్టే ఈ కొండపై దేవుని దర్శించుకుంటే అనుకున్న పనులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

స్థలపురాణం
ఒకానొకప్పుడు భారద్వాజ మహర్షి శ్రీమహావిష్ణువుకోసం తపస్సు ఆచరించాడు. దక్షిణ హిందూ దేశం వెళ్ళిన సందర్భంలో కృష్ణానదికి దగ్గరలో ఉన్న కొండమీద ఆశ్రమం నిర్మించుకుని కఠోర తపస్సుకి పూనుకున్నాడు. మహర్షి తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు తిరుమలగిరి కొండపై 12 నామాలతో “చీమల” ఆకారంలో ప్రత్యక్షమయ్యాడు.సంతోషించిన భారద్వాజుడు కృష్ణానది నుంచి నీరు తీసుకొచ్చి అభిషేకం చేశాడు. వరం కోరుకోమన్న స్వామివారితో ప్రజలు తమ కష్టనష్టాలు చెప్పుకుని సేద తీరడానికి ఇక్కడో ఆలయం కావాలి అందుకోసం నీ అంశను ప్రసాదించు అని కోరాడు. పైగా ఈ సమయంలో ఎక్కడా నదీ ప్రవాహం లేనందున జల తరంగిణి కూడా ఏర్పాటు చేయమని అడిగాడట. సరేనని వరమిచ్చి అంతర్థానమైన స్వామివారు రాత్రికి రాత్రి పుట్టరూపంలో వెలిశారు. కొండపై స్వామివారి పాదం ఆకారంలో పుష్కరిణి కూడా ఉంటుంది.

సర్పరూపంలో స్వామివారు
భారద్వాజ గోత్రం పారాయణంతో రోజువారీ పూజలు కొనసాగుతాయి. ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అయితే ఇక్కడ కేవలం పగటి పూట మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. చీకటి పడితే గుడిలో పూజారులు కూడా కొండ కిందకి రావాల్సిందే. మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు దర్శనం ఉండదు. ఎందుకంటే రాత్రి వేళల్లో కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సర్ప రూపంలో తిరుగుతారని నమ్మకం. పైగా ఆలయం పరిసరాల్లో పెద్ద నాగుపాముని చూసినట్టు స్థానిక భక్తులు చెబుతారు. ఈ ఆలయంలో మరో విశిష్ఠత ఏంటంటే రాత్రి వేళల్లో ముక్కోటి దేవతలు స్వామి వారికి అభిషేకిస్తారట. గుడి తెరిచే సమయానికి అభిషేకం జరిగినట్లుగా ఆనవాళ్లు కూడా కనిపిస్తాయంటారు పూజారులు. వేసవి కాలంలో కూడా కొండపై నీళ్లు ఉండడం మరో ప్రత్యేకత. కొండకింద పద్మావతి అమ్మవారి గుడి ఉంటుంది. పైన శివాలయం కూడా ఉంది. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయుడు. అందుకే కొండచుట్టూ ఐదుచొట్ల ఆంజనేయుడి విగ్రహాలుంటాయి.

తిరుమలగా తిరుమలగిరి -అలివేలుమంగాపురంగా మంగొల్లు
ఈ గ్రామం పేరు తిరుమల తిరుపతిని పోలి ఉన్నట్టే దీనికి సమీపంలో ఉన్న మంగొల్లును మొదట మంగప్రోలు అనేవారు. క్రమంగా మంగవోలు అయి, చివరికి మంగొల్లుగా స్థిరపడింది. ఇక్కడ అలివేలుమంగమ్మ నివసించేదని, అందుకే ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.