డిల్లీ లిక్కర్ స్కామ్ గుర్తుంది కదా.. దాదాపు ఏడాదిగా దేశాన్ని కుదిపేస్తున్న అంశాల్లో అదీ ఒక్కటి. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంకా జైల్లోనే ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత పేరు కూడా అందులో ఉంది. పదుల సంఖ్యలో నిందుతుల పేర్లు చేరాయి. ఆ స్కామ్ విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు మరో అంశం వెలుగులోకి వచ్చింది.
ప్యానిక్ బటన్స్ పై బీజేపీ ఆరోపణలు
ఢిల్లీ బస్సుల్లో ఏమైనా అనుకోనిది జరిగితే తక్షణమే స్పందించి రవాణా శాఖ, పోలీస్ శాఖ అధికారులు సాయపడేందుకు వీలుగా ప్రతీ వాహనంలో ప్యానిక్ బటన్స్ ఏర్పాటు చేశారు. అందులో పెద్ద స్కాం జరిగిందని , ఆమ్ ఆద్మీ ప్రభుత్వం (ఆప్) కోట్లాది రూపాయలు స్వాహా చేసిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఆరోపించారు. ఢిల్లీ యాంటీ కరెప్షన్ బ్యూరో (ఎసీబీ) దీనిపై ఆడిట్ నిర్వహించినట్లు కూడా ఆయన గుర్తు చేశారు. ప్యానిక్ బటన్ స్కామ్ పై విచారణ జరిపించాలని కోరేందుకు త్వరలో బీజేపీ ప్రతినిధి వర్గం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అప్పాయింట్మెంట్ కోరనుంది. పూర్తి వివరాలతో ఒక వినతిపత్రం కూడా సమర్పిస్తారు. నైతిక బాధ్యత వహిస్తూ…ఢిల్లీ రవాణా శాఖామంత్రి కైలాస్ గహ్లోత్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
అసలేమిటీ ప్యానిక్ బటన్స్..
ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం బస్సుల్లో ప్రయాణికుల భద్రతకు ఏర్పాటు చేసిన వ్యవస్థే ఇది. 2020లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుని అమలు చేశారు. ప్రతీ బస్సులోను ఇప్పుడు రెండు వైర్ లెస్ వాకీటాకీలు, మూడు సీసీటీవీలు, ఒక జీపీఎస్ సిస్టమ్, పది ప్యానిక్ బటన్స్ ఉంటాయి. ప్రస్తుతం ఢిల్లీలోని 4,500 బస్సుల్లో ఈ సిస్టమ్ అమలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు ఆ ప్యానిక్ బటన్ నొక్కితే అది కమాండ్ కంట్రోల్ కు సమాచారం అందిస్తుంది.
నెట్వర్క్ లేదు.. బటన్స్ పనిచేయవు..
కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన సెక్యూరిటీ వ్యవస్థలో అన్ని లోపాలే కనిపిస్తున్నాయని ఏసీబీ జరిపిన ఆడిట్ లో తేలింది. బస్సులకు, కమాండ్ కంట్రోల్ రూముకు మధ్య నెట్వర్క్ కనెక్టివిటీ కనిపించడం లేదు. సీసీటీవీ మానిటరింగ్ సెంటర్లలో సరైన సిబ్బంది లేరు. బస్సుల్లో ప్యానిక్ బటన్స్ పనిచేయడం లేదు. తాము ప్యానిక్ బటన్ నొక్కినా కంట్రోల్ రూము నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని డ్రైవర్లు, కండక్టర్లు ఏసీబీ దృష్టికి తీసుకెళ్లారు. ఇంతవరకు ఒక్క సారి కూడా ఇన్ స్పెషన్ జరగలేదు. ఈ మొత్తం స్కీముకు చెల్లిస్తున్న నిధులపై కూడా ఢిల్లీ అధికారులు తలోమాట చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం డీటీసీ, క్లస్టర్ బస్సుల్లో ప్యానిక్ బటన్ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని చెబుతోంది. కష్మీర్ గేట్ ప్రాంతంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని బాకా ఊదుకుంటోంది. ప్రయాణికుల భద్రతకే తమకు ప్రధానమని చెబుతూ అసలు ఏసీబీ ఆడిట్ సంగతే తమకు తెలియదంటోంది. అలా ఉంటుందీ ఆప్ తీరు..