తెలంగాణ బీజేపీలో ఊహించని చేరికలు – వారంతా కాషాయ గూటిలోకే !

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి చేరికలపై ప్రత్యేక దృష్టి సారించారు. సీనియర్ నేతలు, సెలబ్రిటీలను పార్టీలో చేర్చుకునేందుకు గాను వరుసగా చర్చలు జరుపుతున్నారు. శనివారం నాడు పలువురు నేతలు బీజేపీలో చేరారు. మరికొంత మందిని చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. బీజేపీలో చేరేందుకు డజను మంది మాజీ ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు.

బీజేపీలో చేరనున్న నేతలు వీళ్లే ?

మంచిర్యాల జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు సొత్తు సంజీవరావు, అమరాజుల శ్రీదేవి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ ఇద్దరితో మాజీ ఎంపీ వివేక్ సంప్రదింపులు జరిపారు. సంజీవరావు 1983లో చెన్నూరు నుంచి అప్పటి రాష్ట్రీయ సంజయ్‌ విచార మంచ్‌ (మేనకా గాంధీ) పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అమరాజుల శ్రీదేవి 2004లో బెల్లంపల్లి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రె‌స్‌లో చేరారు . వీరితో పాటు మరో 10మంది మాజీలు బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు.

బీజేపీలోకి కృష్ణాయాదవ్ !

హైదరాబాద్‌కు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కృష్ణాయాదవ్ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాదే చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్.. కృష్ణాతో చర్చలు జరిపినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేరిక వాయిదా పడుతూ వస్తోంది. దీంతో తాజాగా మరోసారి బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు జరపడంతో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. పూర్వ హిమాయత్‌నగర్‌ అసెంబ్లీ నుంచి 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. 2016లో టీడీపీకి టాటా చెప్పి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. సీనియార్టీ, ఇంత పలుకుబడి ఉన్నప్పటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని గత కొన్నిరోజులుగా పార్టీ మారాలని అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు యాదవ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

బీఆర్ఎస్ నుంచి కొంత మంది ఎమ్మెల్యేల సంప్రదింపులు

బీఆర్ఎస్ లో పాతిక మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించే అవకాశం ఉందన్న ప్రచారంతో… అలాంటి లిస్టులో ఉన్నట్లుగా అనుమానం ఉన్న వారందరూ బీజేపీ సీనియర్ నేతల్ని సంప్రదిస్తున్నారు. తమకు టిక్కెట్ ఖరారు చేస్తే పార్టీలోకి వస్తామంటున్నారు. అందుకే రాబోయే రోజుల్లో ఊహించని చేరికలు ఉంటాయన్న అంచనాల్లో ఉన్నారు.