ఆంధ్రప్రదేశ్ బీజేపీ .. వైసీపీ సర్కార్ పై చేస్తున్న పోరాటం రెండో దశకు చేరింది. ఏపీబీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి లెక్కలతో సహా చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇవ్వలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలాంటి రాజకీయాలకు బెదిరేది లేదని. .. సమాధానం చెప్పే వరకూ ప్రభుత్వాన్ని వదిలేదని బీజేపీ నేతలంటున్నారు. పురందేశ్వరిని విమర్శించిన నేతలందరికీ గట్టిగా కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి… తొమ్మిది ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సవాల్ చేశారు.
వైసీపీ దగ్గర సమాధానాల్లేవు !
వైసీపీ నాలుగేళ్ల పాలనలో బటన్ నొక్కుడు తప్ప ఎలాంటి పురోగతి లేదు. ఈ కారణంగా రాష్ట్ర ప్రజల ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం ఇచ్చే డబ్బుల మీదనే ఆధారపడాలన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ కుట్రల్ని బీజేపీ బయటపెడుతోంది. బీజేపీ సంధించిన ప్రశ్నలకు స్పందిస్తే.. ఎక్కడ మొత్తం విషయం బయట పడుతుందోనని అంతా సైలెంట్ గా ఉంటున్నారు . సమాధానం చెప్పేందుకు ముందుకు రావడం లేదు. విష్ణువర్దన్ రెడ్డి సంధించిన తొమ్మిది ప్రశ్నల్లో దేనికి సమాధానం చెప్పినా వైసీపీ వైఫల్యం అడ్డంగా బయటపడుతుంది. అందుకే కంగారు పడుతున్నారు.
మరింత దూకుడుగా బీజేపీ పోరాటం !
వైసీపీ సర్కార్ పై మరింత దూకుడుగా వైసీపీ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలో దీనికి సంబంధించిన కార్యాచరణను ఖరారు చేసుకోనున్నారు. ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేయడం వంటి వ్యూహాలను ఖరారు చేసుకోబోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పార్టీగా బలపడాలని.. ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి రావాలని గట్టి గా ప్రయత్నిస్తున్నారు. త్వరలో జనసేనతో జరగనున్న సమావేశంలో ఉమ్మడి కార్యాచరణపై చర్చించనున్నారు.
ఎన్నికల వరకూ తగ్గేదే లేదు !
ఎన్నికల వరకూ వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై తగ్గేదే లేదని ఏపీ బీజేపీ నేతలు గట్టిగా తీర్మానించుకున్నారు. కొత్త అధ్యక్షురాలి నేతృత్వంలో అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముందు ముందు ఈ విషయంలో మరింత దూకుడుగా ఉండనున్నారు.