ఆ సీఐకి వైసీపీ టిక్కెట్ ఇప్పిస్తున్న పవన్ – రాజకీయాలంటే ఇవే మరి !

జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఓ సీఐకి రాజకీయ భవిష్యత్ ఇస్తున్నారు. తన పార్టీ నుంచి టిక్కెట్ ఇస్తే మామూలే కానీ.. ఆయన వైసీపీ నుంచి ఆయన టిక్కెట్ ఇప్పించడమే ఓ రేంజ్ . ఆ రేంజ్ ను పవన్ అందుకుంటున్నారు. ఆ సీఐ పేరు అంజూయాదవ్. ఆమెకు పవన్ టిక్కెట్ ఇప్పించడం ఏమిటా అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. అనవసరంగా ఆమెతో పవన్ పోటీ పెట్టుకోవడంతో… పవన్ కు పోటీగా ఆమెను దింపాలని వైసీపీ అనుకుంటోంది.

గోరంట్ల మాధవ్ లాగే అంజూయాదవ్ కూ టిక్కెట్

2019 ఎన్నికల ముందు సీఐ గోరంట్ల మాధవ్‌ను వైసీపీ చేర్చుకొని.. హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దింపి గెలిపించుకుంది. ఆ తర్వాత ఎంపీగా ఏం ఒరగబెట్టారో.. ఏ మాత్రం ప్రజాసేవ చేశారో ఆ నియోజకవర్గ ప్రజలకే తెలియాలి.! ఆ మధ్య ఓ వీడియోతో తన పదవికే కళంకం తెచ్చారు గోరంట్ల. ఇక ఆ విషయాలు అటుంచితే.. అదే తరహాలో అంజూ యాదవ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ రెడ్డి భావిస్తున్నారు. దీనికి కారణం పవన్ ఆమెను టార్గెట్ చేయడమే. నేనంటే ఏంటో చూపిస్తానని పవన్ ఆమెతో సవాల్ చేశారు. పవన్ రాజకీయ అవగాహన లేకపోవడం వల్ల ఇలా చేశారని అనుకున్నా… దాన్ని వైసీపీ చీఫ్ తనకు అనుకూలంగా మల్చుకోవాలనుకుంటున్నారు.

కడప జిల్లా మైదకూరు టిక్కెట్ ఇస్తారా ?

అంజూ యాదవ్ స్వగ్రామం కడప జిల్లా ది మండలం. వైసీపీ కండువా కప్పుకున్న తర్వాత అన్నీ అనుకున్నట్లు జరిగితే. మైదుకూరు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వయసు, ఆరోగ్య రీత్యా ఈసారి పోటీకి దూరంగా ఉంటారని టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే మైదుకూరు ఎమ్మెల్యేగా పోటీచేస్తారని టాక్. అయితే.. పవన్ కల్యాణ్ ఈసారి తిరుపతి నుంచి పోటీచేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. పవన్ పోటీ చేస్తే మాత్రం సేనాని మీద పోటీచేయించాలన్నది వైసీపీ ప్లానని చెబుతున్నారు.

రాజకీయ ఎంట్రీ కోసం పోలీసుల్లో పోటీ పెరిగినట్లే !

అంజూయాదవ్ కు టిక్కెట్ ఇస్తే… రాజకీయంగా తమ భవిష్యత్ ను సిద్ధపరుచుకోవలాంటే.. అధికార పార్టీలకు అండగా ఉండి.. అరాచకాలకు పాల్పడితే చాలని… విపక్ష నేతలు తమపై ఆరోపణలు చేస్తే..దాన్ని పట్టుకుని రాజకీయంగా ఎదగవచ్చన్న భావనలోకి వస్తారని ఇది పోలీసు వ్యవస్థకు మంచిది కాదని చెబుతున్నారు. కానీ రాజకీయ నేతలు ఇప్పుడు అలాంటివేమీ పట్టించుకోవడం లేదు.