ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీ పర్యటనలో పార్టీ హైకమాండ్ ను కలిసి కొత్త కార్యవర్గంపై నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడ్ని నియమించిన తర్వాత.. పార్టీ పదవుల్లో మార్పు, చేర్పులు చేయడం సహజమే. పురందేశవరి కూడా.. కొన్ని కీలక మార్పులు చేసి… ఎన్నికల సమరానికి వెళ్లాలనుకుంటున్నారు.
పని చేసే యువనేతలకు కీలక బాధ్యతలు
రాష్ట్ర స్థాయిలో బీజేపీ వాయిస్ ను గట్టిగా వినిపించే యువనేతలు కీలకంగా మారారు. విస్తృతంగా పర్యటిస్తూ.. పార్టీని బలోపేతం చేసేందుకు ఇరవై నాలుగు గంటలూ శ్రమించే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని పురందేశ్వరి నిర్ణయించారు. ఇప్పటికే కీలక బాధ్యతల్లో ఉన్న వారికి మరింత ప్రాధాన్యం కల్పించనున్నారు. పార్టీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి.. అన్ని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు. జోనల్ సమావేశాలు విజయవంతం కావడానికి.. కృషి చేస్తున్నారు. ఇలాంటి నేతలకు మరిన్ని బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
మోర్చాలపై ప్రత్యేక దృష్టి
బీజేపీ అనుబంధ మోర్చాలు… పార్టీ బలోపేతం చేయడంలో కీలకంగా ఉంటాయని పురందేశ్వరి అభిప్రాయం. వాటికి బలమైన , కష్టపడే నేతల్ని ఇంచార్జులుగా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకూ లాబీయింగ్ ద్వారా మోర్చాల పదవులు పొందిన వారు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవానంద్ , కొడుకుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇలా మరికొంత మంది ఉన్నారని.. దందాల కోసం పార్టీలో చేరిన వారిని దూరం పెట్టి.. సుదీర్ఘంగా పార్టీ కోసం పని చేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.
సోషల్ మీడియా విభాగం మరింత బలోపేతం !
ఈ రోజుల్లో సగం రాజకీయం సోషల్ మీడియా ద్వారా సాగుతోంది. బీజేపీ ఈ విషయంలో కాస్త వీక్ గానే ఉంది. సోషల్ మీడియా ఇంచార్జ్ గా విష్ణువర్ధన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితుల్లో కాస్తు మెరుగు కనిపించింది. కానీ ప్రధాన పార్టీలను తట్టుకునేలా లేదని.. సోషల్ మీడియాలో బీజేపీ కోసం పని చేసే వారిని ఏకతాటిపైకి తెచ్చి పార్టీ స్టాండ్ కు అనుగుణంగా పని చేసేలా కొత్త ప్రయత్నాలు చేయనున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా వచ్చే వారం రోజుల్లో ఏపీ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.