కాంగ్రెస్ దుశ్చర్యలను ఎండగట్టే ది పంజాబ్ ఫైల్స్

దేశ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. పార్టీలు స్పీడ్ పెంచాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునేందుకు వెనుకాడకుండా ముందుకు సాగుతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే తీరు కనిపిస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇటీవల డీఎంకే ఫైల్స్ పేరుతో ఆ రాష్ట్రంలో అధికార పార్టీ దుశ్చర్యలను ఎండగట్టారు. ఇప్పుడు కొంత వైవిధ్యంగా పంజాబ్ లోనూ అదే తరహా పోకడ ఒకటి కనిపిస్తోంది…

కాంగ్రెస్ టార్గెట్ గా శిరోమణి అకాలీదళ్ దూకుడు

పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ ఇప్పుడు కాంగ్రెస్ పై కారాలు మిరియాలు నూరుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసిపోతున్నాయని గ్రహించిన అకాలీదళ్ గతంలో కాంగ్రెస్ దుశ్చర్యలను ఎండగట్టే ప్రయత్నంలో ఉంది. డీఎంకే ఫైల్స్ తరహాలో ది పంజాబ్ ఫైల్స్ ను విడుదల చేయబోతోంది. కాకపోతే డీఎంకే పైల్స్ కు ది పంజాబ్ ఫైల్స్ కు ఒక తేడా ఉంది. డిఎంకే ఫైల్స్ అనేది కొన్ని కీలక దస్తావేజులు మాత్రమే. ది పంజాబ్ ఫైల్స్ మాత్రం ఒక సినిమా. దానికి సంబంధించిన పోస్టర్ ను అకాలీదళ్ నిన్న ఆవిష్కరించింది.

1984 సిక్కుల ఊచకోతపై సినిమా…

ది పంజాబ్ ఫైల్స్ సినిమా పోస్టర్ మీద రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, జగదీష్ టైట్లర్, సజ్జన్ కుమార్, కమల్ నాథ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఫోటోలున్నాయి. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత సిక్కుల ఊచకోతే కథాంశంగా సినిమా రూపొందినట్లు అకాలీదళ్ వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ బ్లూ స్టార్ లో జరిగిందేమిటో కూడా వివరించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ విడుదల చేయకుండా నేరుగా సినిమా విడుదలకు సిద్ధమైనట్లుగా సమాచారం. రేపు ది పంజాబ్ ఫైల్స్ సినిమా చూడటం మరిచిపోకండి అని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

పంబాజ్ ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంది – అకాలీదళ్

పంజాబ్ ప్రజలపైనా ముఖ్యంగా సిక్కులపైనా జరుగుతున్న దౌర్జన్యాలు, అన్యాయాలను సమాజానికి వివరించేందుకు సినిమా రూపొందించినట్లు అకలీదళ్ నాయకుడు ప్రేమ్ సింగ్ చందూమజ్రా వెల్లడించారు. ఇప్పుడు ఆప్, కాంగ్రెస్ చేతులు కలపడం కూడా పంజాబ్ ప్రజలకు అన్యాయం చేసేందుకేనని ఆయన ఆరోపిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పంజాబ్ ప్రజలను మోసగించేందుకు సిద్ధమయ్యాయన్నారు.

ఇదిలా ఉండగా ఆప్ తో మైత్రిని పంజాబ్ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉండాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేయబోతున్నట్లు కాంగ్రెస్ నేత, పంజాబ్ ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా ప్రకటించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పొత్తు సంగతి ఎలా ఉన్నా… పంజాబ్లోని భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వ దుశ్చర్యలను ఎండగడుతూనే ఉంటామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూనే ఉంటుందన్నారు.