కన్నడ దేశంలో కాంగ్రెస్ అధికారానికి వచ్చినప్పటి నుంచి రోజూ ఏదో వివాదం చెలరేగుతూనే ఉంది. సీఎం సిద్దరామయ్య తీరుపై ఎవరోకరు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈడిగ సామాజిక వర్గం నేత హరిప్రసాద్ ఇటీవలే మంత్రివర్గంలో చోటివ్వనందుకు సీరియస్ అయ్యారు. సీఎంలను ఎక్కించగలను, దించగలను అంటూ హరిప్రసాద్ చేసిన కామెంట్స్ పై దుమారం చల్లారకముందే మరో అంశం తెరపైకి వచ్చింది.
పది మంది ఎమ్మెల్యేల లేఖ..
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాసినట్లుగా ఒక లేఖ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయింపులో మంత్రులు మొండి వైఖరిని పాటిస్తున్నారని ఆరోపిస్తు పది మంది ఎమ్మెల్యేల సంతకాలున్న ఆ లేఖ ఇప్పుడు కర్ణాటకలో సంచలనమైంది. జిల్లా ఇంఛార్జ్ మంత్రులు సహకరించకపోవడంతో ప్రజలకు ఏ పనీ చేయలేకపోతున్నామని పేర్కొంటూ పది మంది కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ప్రజల నమ్మకాల మేరకు పని చేయలేకపోతున్నాం.. మా నియోజకవర్గ పనులపై 20 మందికి పైగా ఇంఛార్జ్ మంత్రులు స్పందించడం లేదని నేరుగా సీఎం సిద్దరామయ్యకు ఎమ్మెల్యేలు లేఖ రాశారు. అధికారుల బదిలీలకు తాము చేసిన సిఫార్సులను సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఏ అధికారి కూడా తమ మాట వినడం లేదని ఎమ్మెల్యేలు అందులో ప్రస్తావించారు.
మాట మార్చుతున్న బీఆర్ పాటిల్
సిద్దరామయ్యకు రాసిన లేఖ వ్యవహారంలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పాటిల్ మాట మార్చుతున్నారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ తొలుత ఈ లేఖ నకిలీదనే వాదించారు. ఈ లేఖ బీఆర్ పాటిల్ లెటర్ ప్యాడ్ మీదే రాసి పది మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టినట్లుగా ఉంది. తన లెటర్ హెడ్ లో పేజీ నెంబర్లు వేసుకోవడం అలవాటని, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖపై పేజీ నెంబర్ లేదని పాటిల్ అన్నారు. అంతలో మాట మార్చి ఒక లేఖ సిద్దం చేసిన మాట నిజమేనని, అది అధికారికంగా విడుదల చేసే లోపే.. అందులోని అంశాలను మార్చివేసి సోషల్ మీడియాలో పెట్టారని ఆయన వివరణ ఇచ్చారు.పైగా ఇదీ బీజేపీ కుట్ర అంటూ ఆరోపణలు సంధించారు. మీటింగ్ పెట్టాలని ఎమ్మెల్యేలు కోరిన మాట నిజమేనని సిద్దరామయ్య అంగీకరించారు. రాహుల్ గాంధీ పర్యటన ఉన్నందున మీటింగ్ నిర్వహించలేకపోయామన్నారు. ఎమ్మెల్యేలెవ్వరూ మంత్రులపై ఫిర్యాదు చేయలేదన్నారు.
ఇదీ అవిశ్వాసమేనంటున్న బీజేపీ
అధికారానికి వచ్చిన రెండు నెలలకే సిద్దరామయ్య ప్రభుత్వం అటు ప్రజలు, ఇటు ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కోల్పోయిందని కర్ణాటక బీజేపీ ఆరోపించింది. అధికారుల బదిలీల కుంభకోణం జరిగినా సిద్దరామయ్య ఏమీ ఎరుగనట్లున్నారని మండిపడింది. 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇరవై మంది మంత్రుల తీరును తూర్పార పడుతున్నారని బీజేపీ గుర్తుచేసింది.