రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ సంక్షోభంలో పడిపోయింది. ఈ సారి రెబల్ స్టార్ సచిన్ పైలట్ వల్ల ఎలాంటి ప్రమాదం రాలేదు. ఉద్వాసనకు గురైన రాజేంద్ర సింగ్ గూఢా చూపించిన ఒక డైరీతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ బండారం మొత్తం బయటపడే సమయం వచ్చింది. దీనిపై బీజేపీ కూడా తనదైన శైలిలో విరుచుకుపడింది.
అసెంబ్లీలో అసలేం జరిగింది..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న ఆగ్రహంతో రాజేంద్ర సింగ్ గూఢాను ముఖ్యమంత్రి గెహ్లాట్ మంత్రి పదవి నుంచి తప్పించారు. దానితో గూఢా అసెంబ్లీకి ఒక ఎర్ర రంగులో ఉన్న డైరీని తీసుకొచ్చి అక్కడ ప్రవేశ పెట్టేందుకు స్పీకర్ అనుమతి కోరారు. తన ఛాంబర్ లో వచ్చి కలవాల్సిందిగా స్పీకర్ ఆదేశించినప్పుడు కాస్త గొందరగోళం ఏర్పడింది, కొందరు సభ్యులు ఆయనపై పడి నెట్టేశారు. ఈ క్రమంలో గూఢాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. సభకు అంతరాయం కలిగిస్తున్నారన్న నెపంతో ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు గెంటేశారు. ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ ను కూడా సస్పెండ్ చేశారు.
రెడ్ డైరీ ఎలా వచ్చింది…
నిజానికి రాజస్థాన్ టూరిజం కార్పొరేషన్ అవకతవకలపై ఆ సంస్థ చైర్మన్ ధర్మేంద్ర రాథోడ్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించాయి. అప్పుడు ఆయన ఇంట్లో ఉన్న ఎర్రని డైరీని తాను తీసేసుకున్నానని గూఢా చెబుతున్నారు. ముఖ్యమంత్రి గెహ్లాట్ సూచన మేరకే డైరీని తస్కరించినట్లు గూఢా చెబుతున్నారు. రాథోడ్ రాసుకున్న ఆ డైరీలో ముఖ్యమంత్రి గెహ్లాట్ ఆయన కుమారుడి పేర్లు ఉన్నాయన్నది గూఢా వాదన. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు వేర్వేరు సందర్భాల్లో అందిన ముడుపులకు సంబంధించిన అన్ని వివరాలు ఆ డైరీలో ఉన్నాయని అనుమానం. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల ఓట్లు కొనుగోలు చేసిన వివరాలు కూడా అదే డైరీలో ఉన్నాయట. 2020లో ఐటీ, ఈడీ దాడులు జరిగినప్పుడు ఆ డైరీని తెచ్చి తన వద్ద భద్రపరిచానని గూఢా వెల్లడించారు.
అంతలోనే డైరీ మాయం- బీజేపీ అనుమానం
అసెంబ్లీలో రెడ్ డైరీని స్పీకర్ కు ఇచ్చేందుకు గూఢా ప్రయత్నించినప్పుడు పెనుగులాట, తోపులాట జరిగింది. దాన్ని ఎవరో లాక్కుని వెళ్లిపోయవడంతో ఇప్పుడా డైరీ ఎక్కడుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. డైరీలో ఏమి లేదని, గుఢా కట్టుకథలు అల్లుతున్నారని కాంగ్రెస్ నేతలు అంటుండగా.. జరూర్ దాల్ మే కుఛ్ కాలా హై అని బీజేపీ అంటోంది. కాంగ్రెస్ పార్టీ చీకటి వ్యాపారాలన్నీ ఆ డైరీలో ఉన్నాయని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు. చట్టం తన పని చేసుకుపోకుండా సీఎం అడ్డుపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. డైరీ బొమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగులు పెట్టి కాంగ్రెస్ పార్టీని బజారున పడెయ్యాలని రాజస్థాన్ బీజేపీ డిసైడైంది.