పుట్టపర్తి నియోజకవర్గంలో రాజకీయం హాట్ హాట్ గా మారింది. సాధారణ ఎన్నికలకు ఇంకా 9 నెలలు ఉన్నప్పటికీ అధికార పార్టీ అయిన వైసీపీ, ప్రతిపక్షమైన టిడిపిల మధ్య పరస్పర మాటలు యుద్ధం కొనసాగుతోంది. నిరసనలు రూపంలో రాజకీయ వేడి మొదలైంది. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కెనరా బ్యాంకులో అప్పు చేసిన రూ. 908 కోట్లు చెల్లించకపోవడంతో ఆ బ్యాంకు ఆగస్టు 18న ఎమ్మెల్యే ఆస్తులను వేలం వేస్తామని ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీకి ఒక అస్త్రం దొరికినట్లు అయింది.
ఎమ్మెల్యే ఆస్తుల వేలానికి బ్యాంకు నోటీసులు
పుట్టపర్తి ఎమ్మెల్యే ఆస్తులు వేయాలని బ్యాంకులు నిర్ణయించడంపై విప్కష నేతలు ముఖ్యంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు చూపించలేదని బ్యాంకు ప్రకటించిన అప్పులతో పాటు బయట ఇంకా ఎన్ని అప్పులు ఉన్నాయో బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు బినామీ అని చెప్పుకుంటూ తన సిరాస్తులు కన్నా ఎక్కువ అప్పులు చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఓడిసి మండల కేంద్రంలో పల్లెతో పాటు ఆ పార్టీ నాయకులు ధర్నా చేసి నిరసన తెలిపారు.
సొంత పార్టీ నేతలకుట్ర ఉందంటున్న వైసీపీ ఎమ్మెల్యే
వ్యాపారాలు అన్నాక అప్పులు చేసిన మాట వాస్తమేనని.. కానీ ఎగ్గొట్టినట్లుగా ప్రచారం చేయడం పట్ల ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే రుణ వాయిదాలు చెల్లిస్తామన్నారు. తమ పార్టీలోనే ఉన్న ఒక కురువృద్ధుడు ‘పల్లె’తో చేతులు కలిపి కుట్ర చేస్తున్నారని పరోక్షంగా కొత్తకోట సోమశేఖర్ రెడ్డిని ఉద్దేశించి మీడియా ముందు ఆరోపించారు. వైసిపి నాయకులు ఓడిసి, నల్లమాడ, పుట్టపర్తి మండల కేంద్రాలలో ‘పల్లె’కు వ్యతిరేకంగా నిరసనలు కూడా చేశారు. కొత్తకోట సోమశేఖర్ రెడ్డి వెన్నుపోటు రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు.
ఇప్పటికే రెండుపార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం !
పుట్టపర్తిలో రెండు నెలల క్రితం టిడిపి వర్గీయులు, వైసీపీ శ్రేణులు పట్టణం నడిబొడ్డున హనుమాన్ కూడలిలో బాహబాహికి దిగి రాళ్లతో,చెప్పులతో దాడికి దిగారు. ఈ సంఘటన మరవక ముందే తిరిగి ఒకరిపై ఒకరు ఆరోపణలు నిరసనలకు దిగి నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయం రాజేశారు. అయితే ఈ సంఘటనలు ఎక్కడికి దారితీస్తాయోనని ఇరు పార్టీల కార్యకర్తలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యక్తిగత అప్పులు… ఆరోపణలపై.. టీడీపీ నేతలు ధర్నాలు చేయడంతో రాజకీయం రాజుకున్నట్లయింది.