గోమాత భారతీయులకు ఆరాధ్య దైవం. గోవు సంతోషంగా ఉంటేనే మన కడుపు చల్లగా ఉంటుంది. మనం కడుపునిండా తాగడానికి పాలిచ్చే గోవును హింసిస్తే పాపం తగలడం ఖాయం. గోవుకు కష్టం రాకుండా చూసుకుంటేనే మనం సంతోషంగా ఉంటాం. తమిళనాడులోని స్టాలన్ ప్రభుత్వం మాత్రం రాజధాని చెన్నైలో గోవులకు ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెడుతోంది. వాటి ఆలనా, పాలనలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతోంది.
రోడ్లకు అడ్డంగా పశువులు
చెన్నైలోని వడపళని ప్రాంతానికి చెందిన ఎల్. కుమార్ అనే వ్యక్తి ఆఫీసుకు వెళ్లేందుకు టీ. నగర్ మీదుగా ప్రయాణం సాగిస్తున్నాడు. రోడ్డంతా ఖాళీగా ఉందని సంతోషంగా ద్విచక్రవాహనాన్ని నడుపుతుండగా, అకస్మాత్తుగా పశువుల గుంపు రోడ్డుమీదకు వచ్చింది. వాటిని చూసి భయంతో సడన్ బ్రేక్ వేయగానే వాహనం జారి కింద పడిపోయాడు. ఎల్.కుమార్ ఎడమ భుజం, రెండు కాళ్లు విరిగాయి. కోలుకునేందుకు ఎనిమిది నెలలు పట్టింది. చెన్నై మహానగరంలో ఎల్. కుమార్ లాంటి గాధలు చాలానే ఉంటున్నాయి. ఇటీవల వేలాచ్చేరీ హండ్రెడ్ ఫీట్ రోడ్డులో రాత్రి పూట దాదాపు రెండు కిలోమీటర్ల ప్రాంతంలో అవులు, ఎద్దులు అడ్డంగా నడుచుకుంటూ వెళ్లాయి. దాదాపు గంట సేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులైనా, లింకు రోడ్డులైనా, చిన్న రోడ్లైనా సరే పశువుల బెడద తప్పడం లేదని చెన్నై వాసులు వాపోతున్నారు.
కార్పొరేషన్ వైఖరై కారణమా.. ?
చెన్నై కార్పొరేషన్ నిర్లక్ష్యం కూడా పశువుల బెడద పెరిగిపోవడానికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రోడ్డు పక్కన ఉండే చెత్త కుప్పల్లో ఆహార పదార్థాలు పడుండటాన్ని గమనించి వాటిని ఆరగించేందుకు ఆవులు, ఎద్దుటు, గేదెలు రోడ్డుకు అడ్డంగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నాయి. వాటిని పెంచుకునే చిన్నకారు పాడి రైతులు కూడా తిండి గడిచిపోతుందన్న నమ్మకంతో రోడ్ల మీద వదిలేస్తున్నారు. నాలుగైదు ఆవులున్న వారికి వాటిని కట్టివేసే చోటు దొరకడం లేదు. అద్దె ఇంట్లో ఉంటే పక్కన కట్టేసుకుని, పాలు పితికిన తర్వాత పగలు రోడ్లమీదకు వదిలెయ్యడం వల్లె చెన్నై వీధుల్లో పశువుల సమస్య పెరిగిపోతోంది. గోవుల వల్ల రోజుకు వెయ్యి రూపాయల ఆదాయం వస్తోందని, దానితో నాలుగైదు వందల వాటి ఖర్చులకు పోగా, మిగిలిన ఐదు వందలే తమ కుటుంబ ఖర్చులకు మిగులుతున్నాయని వారంటున్నారు. అలా మాట్లాడుతూ పశువులను వాటి మానాన వదిలేస్తున్నారు. అలాంటి వైఖరి పశువులకు కూడా కష్టమే. భారీ వాహనాలు ఢీకొన్నప్పుడు పశువులు కూడా గాయపడుతున్నాయి.
ఫైన్లు వసూలు చేసి వదిలేసే ప్రక్రియ
రోడ్ల మీద తిరిగే పశువులను పట్టుకెళ్లే కార్పొరేషన్ అధికారులు నగరంలోని రెండు డిపోల్లో కట్టేస్తున్నారు. రెండు రోజుల్లోపు వాటి ఓనర్లు వచ్చి వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించి విడిపించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులు డిపోల్లోనే ఉంచితే రోజుకు రూ. 200 అదనంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. గతేడాది ఇలా 7 వేల పశువులను పట్టుకెళ్లి ఫైన్లు వసూలు చేశారు. పశువులను పట్టుకెళ్లే క్రమంగా వాటిని లాగి పడేస్తున్నారని యజమానులు ఆరోపిస్తున్నారు.దానితో అవి తీవ్రంగా గాయపడుతున్నాయట. పట్టుకెళ్లిన పశువులకు ట్యాగులు వేస్తున్నామని, వాటి యజమానాలు ఆ ట్యాగులను లాగి పడేసి మళ్లీ రోడ్లమీదకు వదులుతున్నారని కార్పొరేషన్ అధికారులు వివరణ ఇస్తున్నారు. ఏమైనా సరే మహానగరంలో పశువుల బెడద మాత్రం తీరడం లేదు.
చెన్నై కార్పొరేషన్ చేయాల్సిందేమిటి.. ?
రోడ్ల పక్కన చెత్త లేకుండా చూడటం చెన్నై కార్పొరేషన్ తొలి కర్తవ్యం కావాలి. నగర పరిధిలో కొన్ని ఖాళీ స్థలాలను ఎంపిక చేసి అక్కడ గడ్డి పెంచి.. పసువులను కట్టేసేందుకు అనుమతివ్వాలి. పాలు పితికిన తర్వాత పగలంతా గోవులను అక్కడ వదిలేసే ఏర్పాటు చేయాలి. ఇప్పుడు అవి రోడ్ల మీద తిరగకుండా ఉంటాయి. దాని వల్ల ప్రమాదాలను పూర్తిగా తగ్గించే వీలుంటుంది.