కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో అప్పుడే అసమ్మతిరాగం

కాంగ్రెస్ అంటే కొట్లాట. కాంగ్రెస్ అంటే పాతిక మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు. కాంగ్రెస్ అంటే ఒకరు ముఖ్యమంత్రి అయితే పది మంది కిందకు లాగటం. కాంగ్రెస్ అంటే ఐదేళ్ల కాలంలో ఆరుగురు ముఖ్యమంత్రులు మారడం. ఈ అవలక్షణాలు పోగొట్టుకోవడం ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ వల్ల కాదు. కర్ణాటక అందుకు మినహాయింపు కూడా కాదు..

దించే సత్తా ఉందంటున్న హరిప్రసాద్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అప్పుడే అసమ్మతి సెగ తగులుతోంది. సీనియర్ నాయకుడు బీకే హరిప్రసాద్, తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఒక నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం ఎలాగో తనకు బాగా తెలుసని, అదే నాయకుడిని గద్దె దించడం కూడా తనకు వెన్నతో పెట్టిన విద్య అని హరిప్రసాద్ వాగ్బాణాలు సంధించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తాను ప్రధాన భూమిక పోషించినట్లు ఆయన చెప్పుకున్నారు. ఎలాంటి నాయకత్వ సమస్యనైనా పరిష్కరించే దమ్ముధైర్యం తనకు ఉన్నాయని ఆయన అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు అత్యంత సన్నిహితుడైన హరిప్రసాద్ వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్ లో ముఠాతత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

కాంగ్రెస్ లో కులం కార్డు

మంత్రి పదవిని ఆశించి భంగపడిన హరిప్రసాద్ ఇప్పుడు కులం కార్డు వాడుతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. ఈడిగ సామాజికవర్గానికి చెందిన హరిప్రసాద్ ఇటీవల జరిగిన కుల సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొన్ని సామాజిక వర్గాలకు ఆయన అన్యాయం చేశారని మండిపడ్డారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా హరిప్రసాద్ వేర్వేరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజకీయాలను చక్కబెట్టారు. కాకపోతే సొంత రాష్ట్రంలోని సిద్దరామయ్య దెబ్బకు కుదేలయ్యారు.

స్వామిజీల మద్దతు..

ఈడిగ సామాజికవర్గానికి చెందిన స్వామీజీ ప్రణవానంద బహిరంగంగానే హరిప్రసాద్ కు మద్దతు పలికారు. ఎన్నికల దాకా కర్ణాటక శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన హరిప్రసాద్ కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని స్వామీజీ నిలదీశారు. కాంగ్రెస్ తక్షణమే దిద్దుబాటు చర్యలకు దిగకపోతే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఈడిగ సామాజికవర్గం తీరు వేరుగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. నిజానికి హరిప్రసాద్ ముఖ్యమంత్రి కావాల్సి ఉందని ఆ అవకాశం రానిపక్షంలో కనీసం మంత్రి పదవైనా ఇవ్వాలి కదా అని స్వామీజీ ప్రశ్నిస్తున్నారు.

పార్టీలో మాటల యుద్ధం
హరిప్రసాద్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు అప్పుడే కౌంటర్లు మొదలు పెట్టారు. కాంగ్రెస్ లో పెత్తందారీతనం నడవదని, ముఖ్యమంత్రి ఎవరో హైకమాండ్ నిర్ణయిస్తుందని గృహవసతి శాఖామంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అంటున్నారు. హరిప్రసాద్ ప్రకటనకు సమాధానం ఇచ్చే సత్తా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఉందని అందుకే తాము స్పందించదలచుకోలేదని హోం మంత్రి జి.పరమేశ్వర అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ కూడా స్పందించింది. ఈడిగ సామాజికవర్గాన్ని విస్మరించినందునే హరిప్రసాద్ ఆగ్రహం చెంది ఉంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథ్ నారాయణ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం ఒట్టిమాటేనని కొన్ని వర్గాలకు మాత్రమే అక్కడ పెద్ద పీట వేస్తారని ఆయన చెప్పుకొచ్చారు.