నిత్యవసర సరుకులైన బియ్యం, పప్పుధాన్యాలు, రకరకాల రవ్వలు, పిండి ఇవన్నీ నెల, రెండు నెలలు, ఆరునెలలకు సరిపడా ఒకేసారి కొనుగోలు చేసి నిల్వచేసుకుంటారు. వేసవిలో పర్వాలేదు కానీ వర్షాకాలం, శీతాకాలంలో వాటికి పురుగు పట్టడం మొదలవుతుంది. కొన్ని సార్లు ఇలా నిల్వ చేసుకున్న బియ్యం, దినుసులు పురుగు పడుతూ ఉంటాయి. పురుగులతో పాటు వాటి లార్వాలు, గుడ్లు కూడా ఉంటాయి. ఇలా పురుగు పట్టిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం కూడా అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. ఇలా అవి పాడవకుండా ఉండాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు.
బియ్యం, పప్పు దినుసులు పురుగుపట్టకుండా చేసే కొన్ని రకాల పొడులు లభిస్తూ ఉంటాయి. అయితే వీటి తయారీలో రసాయనాలను ఉపయోగిస్తూ ఉంటారు కనుక వాటిని వాడకపోవడమే మంచిది. రసాయనాలు కలిపిన పొడులకు బదులుగా కొన్ని రకాల చిట్కాల ద్వారా నిత్యవసర సరుకుల్లో పురుగుపట్టకుండా చేయొచ్చు.
వేప ఆకులు
డబ్బాలను బాగా శుభ్రం చేసి తడి లేకుండా చేసిన తర్వాత అందులో సరుకులు నిల్వచేయాలి. వాటిలో కొన్ని వేప ఆకులు వేయడం ద్వారా పురుగు చేరదు. ఒకవేళ అప్పటికే బియ్యం, పిండిలలో పురుగులు ఉన్నా వేపాకులు వేయడం వల్ల ఆ వాసనకి అవి నశిస్తాయి.
ఎండుమిర్చి
నిల్వ చేసిన బియ్యం, రవ్వ, ఇతర ధాన్యాలలో ఎర్ర మిరపకాయలు వేస్తే వాటినుంచి వచ్చే ఘాటుకి క్రిమికీటకాలు దరిచేరవు. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
అగ్గిపెట్టె
నిల్వ చేసిన నిత్యవసర సరుకుల్లో పురుగు చేరకుండా ఉండాలంటే వాటిమధ్య అగ్గిపెట్టెలు కూడా ఉంచొచ్చు. అగ్గిపుల్లలలో సల్ఫర్ ఉంటుంది. దీని కారణంగా పప్పులు, ధాన్యాలలో కనిపించే కీటకాలు చనిపోతాయి. ధాన్యం సురక్షితంగా ఉంటుంది. ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
లవంగ
పురుగు పట్టిన బియ్యం, పిండి వంటి వాటిలో లవంగాలను వేయాలి. లవంగాలను వేయడం వల్ల వాటి నుంచి వచ్చే ఘాటు వాసనకు పురుగులు తొలగిపోతాయి. అలాగే ఆహార పదార్థాలను నిల్వ చేసే కబోర్డ్ లలో, ఆల్మారాల్లో కూడా అక్కడక్కడ లవంగాలను ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
వెల్లుల్లి రెబ్బలు
తీసిపడేసిన వెల్లుల్లి రెబ్బలను డస్టబిన్ లో వేయకుండా నిల్వఉంచిన సరుకుల దగ్గర వేయండి. వీటి నుంచి వచ్చే వాసనకు కూడా పురుగులు దరిచేరవు.
బిర్యానీ ఆకులు
బిర్యానీ ఆకులు కలపడం. వండే ముందు వీటిని ఏరి పారేయడం కూడా చాలా సులువు. బియ్యం డబ్బాలో అడుగున ఓ అయిదు ఆకులు, మధ్యలో ఓ అయిదు ఆకులు, పైన ఓ అయిదు ఆకులు వేసి ఉంచండి. గాలి చొరబడకుండా బియ్యం మూట మూతిని కట్టేయండి.
నల్లమిరియాలు
నల్ల మిరియాలు కూడా నిల్వ ఉంచిన సరుకులకు పురుగు పట్టకుండా సహకరిస్తాయి. నల్ల మిరియాల నుంచి వచ్చే ఘాటైన వాసనలు పురుగులను చేరనివ్వవు.
ఆహార పదార్థాలు నిల్వచేసేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు ఎండలో పెట్టడం వల్ల కూడా పురుగులు సులభంగా తొలగిపోతాయి. అయితే నిత్యవసర సరుకులన్నీ ఎండలో పెట్టొచ్చు కానీ బియ్యం పెడితే మాత్రం ముక్కలుగా విరిగిపోతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం