మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పదేళ్ల యునైటెడ్ ప్రోగ్రసివ్ అలెయన్స్ (యూపీఏ) పాలనా కాలంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాంకింగ్ వ్యవస్థ పాతాళానికి పడిపోయి ప్రభుత్వ బ్యాంకుల్నే మూసి వేయాల్సిన దుర్గతికి నెట్టివేయబడ్డాయి. ప్రతీ పీఎస్బీకి వేల కోట్ల నష్టం వాటిల్లి డిపాజిటర్లకు తిరిగి చెల్లించలేని దీనస్థితికి చేరుకున్నాయి. సరిగ్గా అప్పుడే మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చి దిద్దుబాటు చర్యలు చేపట్టి బ్యాంకుల ఆర్థిక స్థిరీకరణకు అవకాశం కల్పంచింది.
యూపీఏ పెద్దల అవినీతి
ప్రధాని మోదీ ఒక రోజ్గార్ మోళాలో చేసిన కామెంట్స్ అప్పటి యూపీఏ కాలంలోని అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఫోన్ బ్యాంకింగ్ అనే మాటకు యూపీఏ కాలంలో కొత్త నిర్వచనం బట్టబయలైందని మోదీ అన్నారు. ఒక కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వ్యక్తులు బ్యాంకులకు ఫోన్లు చేసి వేల కోట్లు అప్పులు ఇప్పించేవారని ప్రధాని గుర్తుచేశారు. ఆ రుణాలన్ను ఎన్నటికి తిరిగిరాక మొండిబకాయిలు పెరిగిపోయాయని వాటితో బ్యాంకులు దివాలా తీశాయని మోదీ విశ్లేషించారు. యూపీఏ పెద్దల అధికారదాహం బ్యాంకులను దెబ్బతీసిందన్నారు.ఒక లోను బకాయిని తీర్చేందుకు మరో లోన్ తీసుకోవడం ద్వారా బ్యాంకుల ఖజానా ఖాళీ చేశారని అప్పుడు జరిగిన ఘటనలను ఆయన పరోక్షంగా గుర్తుచేశారు. నడ్డి విరిగిన బ్యాంకింగ్ వ్యవస్థను ఎన్డీయే అధికారం చేపట్టిన తర్వాతే గాడిలో పెట్టగలిగామని మోదీ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఫోన్ బ్యాంకింగ్ అంటే సామాన్య ప్రజల లావాదేవీలకు ఉపయోగపడే వ్యవస్థ అని, అప్పట్లో ఫోన్ బ్యాంకింగ్ అంటే వ్యవస్థలను నాశనం చేసే ప్రక్రియ అని మోదీ అన్నారు.
విలీనాలతో బ్యాంకులకు మహర్దశ
బ్యాంకులను పటిష్టం చేసే దిశగా చిన్న వాటిని పెద్ద బ్యాంకుల్లోకి విలీనం చేశామని మోదీ ప్రస్తావించారు. బ్యాంకు ఉద్యోగుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులోనూ, డిపాజిట్ల సేకరణలోనూ బ్యాంకు ఉద్యోగుల కృషి ప్రశంసనీయమని అంటూ అందుకే రికార్డు స్థాయిలో లాభాలు వస్తున్నాయన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సేవ చేయడంలో బ్యాంకు ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తున్నారని అంటూ ముద్ర లోన్లను ప్రస్తావించారు. బ్యాంకుల దివాలా చట్టాలను అమలు చేయడం ద్వారా మొండిబకాయిల నుంచి విముక్తి కలిగించామని చెప్పారు.అప్పులను ఎగ్గొట్టేవారి ఆస్తులను జప్తు చేయడం ద్వారా బ్యాంకుల నష్టాలను పూడ్చామని, ఎగవేతదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్తితి తెచ్చామని చెప్పారు.
ఖాతాదారులకు బీమా సౌకర్యం
వాస్తవానికి మోదీ అధికారానికి వచ్చిన తర్వాత బ్యాంకు ఖాతాదారుల్లో విశ్వాసం పెరిగింది. ఐదు లక్షల వరకు డిపాజిట్లకు బీమా సౌకర్యం కల్పించారు. దీనితో 99 శాతం ఖాతాదారుల సొమ్ముకు భద్రత లభించినట్లయ్యింది. భారీ మొత్తంలో అప్పులిచ్చే తరుణంలో ఉన్నత స్థాయి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలోనే భారతదేశం మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉన్న తరుణంలో ఆ దిశగా బ్యాంకింగ్ వ్యవస్థ కీలక భూమిక పోషించబోతోంది.